చిరు రెడీ అవుతున్నారా?
వరుసపెట్టి తెలుగు సినిమాలు భారీ హిట్లు కొడుతుండటం, వందలకోట్ల వసూళ్లు చేస్తుండటంతో.. అన్నీ మంచి శకునములే అని భావించిన చిరంజీవి.. తన 150వ సినిమా కోసం రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లే.. చిరంజీవి కొత్త లుక్తో కూడిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బ్లూ కలర్ ఫేడెడ్ జీన్స్, దానిమీద రౌండ్ నెక్ టీషర్టు ధరించిన చిరంజీవి, గాగుల్స్ పెట్టుకుని డార్క్ బ్లూ కలర్ గోల్ఫ్ కార్టును ఆనుకుని ఫొటోకు పోజిచ్చారు.
పైపెచ్చు, రాజకీయాల్లో ఉన్నప్పటిలా కాకుండా కొంత గ్లామర్ డోసు కూడా పెంచినట్లే కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే, గతంలో ప్రకటించినట్లుగా తన 150వ సినిమా కోసం ఆయన సిద్ధమైపోతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'ఆటోజానీ' అనే సినిమాను చిరంజీవి చేయబోతున్నారంటూ ఇంతకు ముందు కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దానికి స్వయంగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా అప్పట్లో అన్నారు. అయితే ఇప్పుడు అదే సినిమానా.. లేక మరో సినిమాయా అన్న విషయం తెలియదు గానీ, మొత్తానికి చిరు మాత్రం సినిమాల కోసం మళ్లీ ముఖానికి రంగేసుకున్నట్లే తెలుస్తోంది.