ఆటోలో వచ్చాడని.. మాల్‌లోకి నో ఎంట్రీ!
ముంబై: అదో పెద్ద షాపింగ్ మాల్. అందులోకి వెళ్లాలంటే కాస్త స్టేచర్ ఉండాలన్నది ఆ మాల్ యజమానుల నిబంధన. అయితే ఈ నిబంధన ఎక్కడా లేదు. ఆ మాల్‌కు ఆటోలో వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆటోలో వచ్చాడని మాల్ సిబ్బంది లోపలకు రానివ్వలేదు.
ముంబై శివారు ప్రాంతం కుర్లాలో వికాస్ తివారీ (28) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యులతో కలసి దీపావళి పండగకు షాపింగ్ చేసేందుకు మాల్‌కు వెళ్లాడు. వికాస్ సోదరుడు సంతోష్‌కు ఆటో ఉంది. ఆయన ఆటోలోనే వికాస్.. తన భార్య, సోదరుడి భార్య, పిల్లలను తీసుకుని ఫోయెనిక్స్ మార్కెట్‌సిటీ మాల్‌కు వెళ్లాడు. మాల్ లోపలకి ఆటో వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు గట్టిగా కేకలు వేస్తూ వారిని అడ్డుకున్నాడు. మాల్ లోపల ఆటోలను పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదని అభ్యంతరం చెప్పాడు. ఈ మాట వినగానే షాకయ్యానని వికాస్ చెప్పాడు.
ఆటోలను లోపలకు అనుమతించబోమని ఎక్కడ రాశారని గార్డును ప్రశ్నిస్తూనే, ఈ తతంగాన్ని మొబైల్‌తో వీడియో తీశానని తెలిపాడు. గార్డు తనను సెక్యూరిటీ క్యాబిన్లోకి తీసుకెళ్లాడని, అక్కడున్న గార్డులు వీడియో తీయవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని వికాస్ చెప్పాడు. మొదట్లో భయపడినా, తన భద్రత కోసం వీడియో తీశానని తెలిపాడు. ఆటోలను లోపలకు అనుమతించరాదన్న నిబంధన ఉందని గార్డులు ఎవరూ చెప్పలేదని, వాగ్వాదం జరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పాడు. పోలీసులు వచ్చి విషయం తెలుసుకుని నవ్వారని, ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా తనకు సూచించినట్టు తెలిపాడు. అయితే తనతో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వికాస్ చెప్పాడు. ప్రతి రోజు ఆటో డ్రైవర్లు వందలామందిని మాల్స్‌కు తీసుకెళ్తుంటారని, అయితే ఆటోలను లోపలకు ఎందుకు అనుమతించరని ప్రశ్నించాడు. వికాస్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు దృష్టికి తీసుకెళ్లాడు.