ఆ బుక్ మీరూ చదవండి: కోహ్లీ
వరుస సిరీస్ విజయాలతో మాజీ కెప్టెన్ల రికార్డులను నీళ్లప్రాయంలా తిరగరాస్తున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. నాలుగు వరుస టెస్ట్ సిరీస్ లలో డబులు సెంచరీలు సాధించి అరుదైన రికార్డును ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టులో తన ఖాతాలో వేసుకున్నాడు. డాన్ బ్రాడ్ మన్, రాహుల్ ద్రవిడ్ ల రికార్డును సవరించడంపై కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించాడు. తన ఎదుగుదలకు, సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించాడు. పరమహంస యోగానంద రచించిన 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి' తనను గొప్ప బ్యాట్స్ మెన్ గా తీర్చిదిద్దడంలో తోడ్పడిందని ఓ పోస్ట్ లో రాసుకొచ్చాడు కోహ్లీ. ఆ బుక్ నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అంటున్నాడు.
'నాకు 'ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి' బుక్ అంటే ఎంతో ఇష్టం. దయచేసి ఈ బుక్ మీరు కూడా చదవండి. అలా చేస్తే తమ ఆలోచనలను, సిద్ధాంతాలను, మార్గాన్ని నమ్ముకుని కచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయాలి' అంటూ కోహ్లీ మరెన్నో విషయాలను పేర్కొన్నాడు. కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శిష్యుడి నిబద్ధతను ప్రస్తావించాడు. గొప్ప ప్లేయర్ గా, కెప్లెన్ గానూ రాణించాలంటే ఏం చేయాలని అడిగాడు.. తాను సూచించినట్లుగానే డైట్ లో ఫాస్ట్ ఫుడ్, బట్టర్ చికెన్ లకు దూరంగా ఉండాలని చెప్పగా కోహ్లీ వాటిని పాటిస్తున్నాడని వివరించాడు. కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాలని అర్థం చేసుకున్న కోహ్లీ ఆటతీరు ఎంతగా మారిపోయిందో చెప్పనక్కర్లేదు.