వారిని అవమానించడం లైంగిక వేధింపే!
మహిళా ప్రభుత్వోద్యోగుల భద్రతపై లోక్సభలో కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను అవమానించేలా ప్రవర్తిం చడం లైంగిక వేధింపుల కిందకు రానుంది. వారిని బెదిరించడం, పనిలో జోక్యం చేసుకోవడం, ఉపాధికి హాని కలిగించేలా ప్రవర్తించడం తదితర చర్యలన్నింటినీ కేంద్రం లైంగిక వేధిం పుల పరిధిలోకి తెచ్చింది. లైంగిక వేధింపుల నిర్వచనానికి విస్తృత అర్థాన్ని చేరుస్తూ కేంద్ర సర్వీసు నిబంధనలకు ఈ నెల 19న సవరణ చేసినట్లు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం లోక్సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ట్రిపుల్ ఐటీ బిల్లుకు ఆమోదం: అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంలలోని ట్రిపుల్ ఐటీలను ఒకే అధికార పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఐటీ-2014 బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది.
ఆస్తుల వివరాల వెల్లడి గడువు డిసెంబర్ 31: లోక్పాల్ చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వోద్యోగులంతా డిసెంబర్ 31లోగా తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం లోక్సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చింది.
నిషేధం లేదు: జీఎం పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలపై ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు నిషేధం విధించలేదని కేంద్రం లోక్సభకు తెలిపింది.
కార్మిక చట్టాలకు సవరణలు: బాలకార్మిక వ్యవస్ధ నిరోధక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, కనీస వేతనాల చట్టం సహా పలు కార్మిక చట్టాలకు సవరణలు చేపట్టే అంశాన్ని ప్రభుత్వం శ్రద్ధగా పరిశీస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులిచ్చారు.