కళే బతికించింది
తూర్పుగోదావరి, కొత్తపల్లి: తనలో ఉన్న కళే తనను బతికించిందని ప్రముఖ నాటక, బుల్లితెర, సినీ నటి ఏలూరి సరోజ తెలిపారు. తనలో ఉన్న నటనా కళ నాటక రంగం నుంచి అంచెలంచలుగా సినీ రంగంలోకి ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు సాధించేలా చేసిందని చెప్పారు. కొండెవరంలో వేంచేసియున్న శ్రీపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీల్లో ‘కథ’ నాటికలో ఆమె శ్యామల పాత్రను పోషించారు. ఈ సందర్భంగా ఆమెను శ్రీ వేంటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ, కళా పరిషత్తు చైర్మన్ మేడిశెట్టి శ్రీరాములు, మారిశెట్టి బుజ్జి, చెలికాని జగదీష్, వాసిరెడ్డి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆమె సినీ పరిశ్రమలో పనిచేస్తూ కూడా రామచంద్రపురం కళాపరిషత్తు నిర్వాహకురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’
ఆమెతో నిర్వహించిన ఇంటర్వ్యూ...
ప్ర: నటనా రంగానికి ఎలా వచ్చారు?
జ: మా పిన్ని నాటకాల్లో నటించడం వల్ల ఆమె ప్రోత్సాహంతో ఈ రంగంలోకి వచ్చాను.
ప్ర: నాటక రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారు?
జ: నాటక రంగానికి నా 12వ ఏట ప్రవేశించాను.
ప్ర: మొదటి నాటకం పేరు?
జ: గాలివాన నాటకంలో సుందరి పాత్ర పోషించాను. రామచంద్రపురంలో ఈ నాటకం ప్రదర్శించాము.
ప్ర:ఎన్ని సినిమాల్లో చిత్రాల్లో నటించారు?
జ: ఇప్పటి వరకూ 70కు పైగా చిత్రాలలో నటించాను. వాటిలో అవును వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు, మాస్, కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, టచ్‌లో ఉంటే చెబుతా, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఎంఎల్ఏ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి.
ప్ర:ఏయే హీరోల చిత్రాలలో నటించారు?
జ: నాగార్జున, రవితేజ, కళ్యాణ్‌రామ్ చిత్రాలతో పాటు ఇంచుమించు నేటి హాస్య నటులందరితోనూ నటించాను.