పత్తి రైతు ఆత్మహత్య
లక్సెట్టిపేట : మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆవునూరి బాలయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆకుల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలయ్య తన సొంత భూమిలో ఎకరం పది గుంటల్లో పత్తి సాగు చేశాడు. రూ.30వేలు పెట్టుబడి పెట్టాడు.
దిగుబడి సరిగా రాకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలయ్య గురువారం సాయంత్రం చనిపోయాడు. ఆయనకు భార్య గౌరమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.