‘బంగారు తల్లి’కి ఎన్ని కష్టాలో!
పరిగి, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బంగారు తల్లి పథకం అమలులో నీరుగారుతోంది. ఆడపిల్లను భారమనుకోకండి... మహాలక్ష్మిలా భావిం చండి... చదువు చెప్పించండి... ప్రోత్సహిస్తాం... ఆర్థిక సాయం అందజేస్తామన్న ప్రభుత్వం... పథకం గురించి పేదలకు అవగాహన కల్పించడంలో విఫలమవుతోంది. తెల్ల రేషన్కార్డులున్న కుటుంబాల బాలికల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం.. ప్రారంభించి తొమ్మిది నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు.
బంగారు తల్లుల తల్లిదండ్రులకు భరోసానివ్వటం లేదు. మొదట్లో ఆర్భాటాలు చేసిన ప్రభుత్వం బంగారు తల్లి పథకం గురించి గ్రామీణ పేదలకు అవగాహన కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకూ జన్మించిన బాలికలకు, పథకం కోసం ఐకేపీలో నమోదవుతున్న సంఖ్యకు ఏ మాత్రం పొంతన కుదరటం లేదు. గణాంకాలను బట్టి చూస్తే జిల్లాలో 50 శాతానికిపైగా ప్రజలకు బంగారు తల్లి పథకం గురించే తెలియదనే విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు పథకం గురించి కొందరికి తెలిసినా అధికారులు సహకరించకపోవడంతో తిప్పలు పడుతున్నారు. బాలిక జనన ధ్రువీకరణ పత్రం, తల్లిపేరిట బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఇబ్బందులు తప్పటం లేదు. బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి పంచాయతీ అధికారులు, ఖాతాలు తెరవడానికి బ్యాంకర్లు రోజుల తరబడి తిప్పుకుంటుండటంతో పలువురు బంగారుతల్లి పథకం వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
ప్రజల్లో అవగాహనా లోపం...
జిల్లాలో ‘బంగారుతల్లి’ గురించి సగానికిపైగా ప్రజలకు అవగాహన లేదనే విషయాన్ని పథకం ప్రారంభమైన నాటినుంచి నమోదైన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో పథకం ప్రారంభమైన గతేడాది మే నుంచి ఇప్పటివరకు 13,362మంది బాలికలు జన్మించి నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరిలో 1,232మంది బాలి కలు మూడో కాన్పులో జన్మించడం, గులాబీ రేషన్‌కార్డుల కుటుంబాలు కావడంతో పథకానికి అర్హత పొందలేదు.
మిగిలిన 12,130 మంది బాలి కలు బంగారు తల్లి పథకానికి అర్హులైనప్పటికీ ఇప్పటివరకు 4,844మంది బాలికల కోసమే ఐకేపీ కార్యాలయాల్లో తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,149మందికి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి మొదటి విడత డబ్బులు అందగా, మిగతా 1695 దరఖాస్తులు ఆయా స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇంకా 7,286 మంది బాలికలకు బంగారు తల్లి పథకం అందాల్సి ఉంది.
పరిగి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పథకం రిజిస్ట్రేషన్లలో కొన్ని మండలాలు చాలా వెనుకబడ్డాయి. మే నుంచి ఇప్పటివరకు బంట్వారంలో 34 మంది బాలికలకు, బషీరాబాద్‌లో 36మందికి మాత్రమే పథకం నుంచి మొదటి దఫా ఆర్థిక సాయం అందింది. పరిగి, మర్పల్లి, చేవెళ్ల మండలాల్లో అత్యధికంగా 150కి పైగా బాలికలకు తొలివిడత ఆర్థిక ప్రయోజనం అందింది.
పథకంతో ప్రయోజనాలివీ...
తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో మొదటి, రెండో కాన్పులో జన్మించిన ఆడపిల్లలకు పథకం వర్తిస్తుంది. ఒకేసారి కవలలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. బాలిక జన్మించింది మొదలు డిగ్రీ పూర్తి చేసుకునే వరకు అంటే 21ఏళ్లు నిండే వరకు మొత్తం తొమ్మిది దఫాలుగా రూ.2.15లక్షలను ప్రభుత్వం అందజేస్తుంది. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తేనే ఈ మొత్తం అందజేయాలనే నిబంధన ఉంది. మధ్యలో చదువు ఆపేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా తగ్గుతాయి.