ఖాకీలకు ‘ఐటీ’ సాయం
* నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం
* పోలీసులకు ఐటీ నిపుణుల అవగాహన
* డేవ్థాన్ సదస్సులో సీవీ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులో పట్టపగలు నడిరోడ్డులో హత్యో, రోడ్డు ప్రమాదమో జరిగితే.. ఫుల్ ట్రాఫిక్ జాం.. పోలీసులు వెళ్లేందుకు ఆలస్యమవుతుంది.. అక్కడేం జరిగిందో తెలియదు.. ఇక ముందు అలాంటి చోట ఎయిర్ కాప్ వాలిపోతుంది. అక్కడ జరుగుతున్నది ఫోటోలు, వీడియోలు తీసి వాయిస్ రికార్ట్తో సహా కంట్రోల్ రూం సర్వర్‌కు పంపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటివెన్నో ఐటీ నిపుణులు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు తెలియజేసేందుకు శనివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ‘డేవ్థాన్’ సదస్సులో ప్రయోగాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. ఐటీ నిపుణులు రూపొందించిన కాప్కామ్, రిపోర్ట్ యాప్, అడాప్టివ్ ట్రాఫిక్, ఎయిర్కాప్, చలాన్ అలర్ పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఐటీ నిపుణులు ప్రజల భద్రతపై దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. అడాప్టివ్ ట్రాఫిక్ టెక్నాలజీని ఐటీ నిపుణులు కునాల్, చందన్‌లు రూపొందించారన్నారు.
ఎయిర్ కాప్‌ను నిరంజన్ తయారు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని వారు ఒకే ఒక్క మొబైల్ యాప్‌తో పోలీసులకు రిపోర్టు చేయవచ్చన్నారు. ఈ యాప్‌ను ఐటీ నిపుణులు హిమబిందు, నితిన్‌రెడ్డి రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసులు, రామారాజేశ్వరి, కార్తికేయతో పాటు పలువురు ఐటీ నిపుణులు ఉన్నారు.