మర్రి ఊడలు కాదు.. చేతిగోళ్లు!
► గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన అయానా విలియమ్స్
► 23 ఏళ్ల శ్రమకు ఫలితం దక్కిందన్న మహిళ
వాషింగ్టన్: మర్రి ఊడలను తలపించేలా చేతివేళ్ల గోళ్లను భారీగా పెంచేశారు అమెరికాకు చెందిన మహిళ. పొడవాటి గోళ్లతో ఫొటోలకు ఫొజిస్తోన్న ఆమె పేరు అయానా విలియమ్స్. రెండు దశాబ్దాలకు పైగా ఆమె పడ్డ శ్రమకు నేడు తగిన గుర్తింపు దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 2018లో ఆమె తన పేరు లిఖించుకున్నారు. రెండు చేతులవేలిగోళ్లు అతిపొడవుగా ఉన్న కేటగిరీ (మహిళలు)లో అయానా ఈ ఘనత సాధించారు. టెక్సాస్ కు చెందిన అయానా గత 23 ఏళ్ల నుంచి పడ్డ శ్రమ వృథాకాలేదని చెబుతారు.
ఆమె చేతివేలి గోళ్ల మొత్తం 576.4 సెంటీమీటర్లున్నాయి. 18 అడుగుల 10.9 ఇంచుల పొడవైన గోళ్లున్నప్పటికీ అయానా తన పనులు తానే చేసుకుంటూ అందర్నీ అశ్చర్యానికి లోను చేస్తున్నారు. గోళ్లను ప్రతిరోజు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో శుభ్రం చేయడంతో పాటు నెయిల్ బ్రష్ కు కాస్త పనిచేబుతానని ఆమె గర్వంగా చెబుతున్నారు. తాను కష్టపడి కాదు ఇష్టపడి చేసినందువల్ల.. 23 ఏళ్లపాటు చేతుల వేలిగోళ్లను పెంచుతూ కాపాడుకోవడం ఇబ్బంది అనిపించలేదన్నారు. అయితే కొన్ని పర్యాయాలు దుస్తులు వేసుకునే సమయంలో మాత్రమే తనకు కాస్త కష్టమనిపించేదని వివరించారు.