నయీమ్ సోదరి, బావ అరెస్ట్
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ సోదరి ఆయేషా బేగం, ఆమె భర్త సలీమ్‌లను సోమవారం నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ పేరుతో బెదిరింపులకు పాల్పడి భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ వసూళ్లకు సహకరించినందుకు వీరిపై 4 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శంకర్‌గౌడ్ తెలిపారు. వీరు మెదక్ జిల్లా కోహీర్‌లో సోమవారం దొరికినట్లు చెప్పారు. వీరిని అరెస్ట్ చేసి భువనగిరి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు.
పోలీస్ కస్టడీకి నయీమ్ గ్యాంగ్
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా సభ్యులను పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న సాజిదా, హసీనా బేగంలను నార్సింగ్ పోలీసులు 8 రోజుల కస్టడీకి తీసుకున్నట్లు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. వీరిని విచారిస్తే నయీ మ్కు సంబంధించి కీలక విషయాలు బయట పడొచ్చన్నారు. వీరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ ముగిసిన అనంతరం వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.