Ayurveda divas
-
భారత్‌లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం
న్యూఢిల్లీ: భారతీయ సంప్రదాయ వైద్య విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారత్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. శుక్రవారం ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటీఆర్ఏ), రాజస్తాన్‌లోని జైపూర్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ)లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని పంపిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేసియస్ భారత్‌లో సంప్రదాయ వైద్యం కోసం ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. ‘‘సంప్రదాయ వైద్యాన్ని పటిష్టం చేయడానికి, దానిపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించి అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారత్‌లో గ్లోబల్ సెంటర్‌ను నెలకొల్పబోతున్నాం’’అని ఆ సందేశంలో పేర్కొన్నారు. సురక్షిత, ఆరోగ్య ప్రపంచం కోసం డబ్ల్యూహెచ్‌వో పూర్తి సహకారం అందిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ సంప్రదాయ వైద్య విధానాలకు మహర్దశ తీసుకురావడంలో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు టెడ్రోస్ చెప్పారు. ఈ కేంద్రం అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ టెడ్రోస్‌కు ధన్యవాదాలు తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని ప్రధాని చెప్పారు. వీర సైనికులకి దీపాల సెల్యూట్: ప్రధాని పిలుపు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్లో ఉన్న సైనిక కుటుంబాలకు కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలని ప్రధాని శుక్రవారం ట్వీట్ చేశారు. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో దివ్వెలు వెలిగించి సైనికులకి గౌరవ వందనం చేయాలంటూ తాను ఇచ్చిన సందేశం ఆడియో క్లిప్‌ని పోస్టు చేశారు. -
ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యం
విజయవాడ (లబ్బీపేట): ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోందని, దుష్ఫలితాలు లేని వైద్యం కావడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ అన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. నగరంలోని ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాల బలరామ్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న మధుమేహ నియంత్రణ, చికిత్సపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీవీఎం కృష్ణ, కార్యదర్శి టీవీఎన్ రామకృష్ణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.