ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యం
విజయవాడ (లబ్బీపేట): ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతోందని, దుష్ఫలితాలు లేని వైద్యం కావడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ అన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. నగరంలోని ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాల బలరామ్ మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న మధుమేహ నియంత్రణ, చికిత్సపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీవీఎం కృష్ణ, కార్యదర్శి టీవీఎన్ రామకృష్ణ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.