రెండు కార్లు ఢీ
► నలుగురికి గాయాలు
► రోడ్డు మరమ్మతు పనుల అలసత్వంతోనే ప్రమాదం
మొయినాబాద్: ఎదురురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై గండిపేట చౌరస్తా వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన యువకులు చాకలి సురేష్, ఆలూరు సంతోష్, ఆలూరు వెంకటేష్, మల్రెడ్డిగారి విష్ణువర్ధన్ రెడ్డి నలుగురు స్నేహితులు.
గురువారం రాత్రి పనినిమిత్తం గండిపేట మండలం సన్ సిటీకి కారులో వెళ్లారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా గండిపేట చౌరస్తా సమీపంలో ఎదురుగా రాంగ్రూట్లో వచ్చిన స్కార్పియోకారు వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జై నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిని వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు మరమ్మతు పనుల అలసత్వం వల్లే...
ఈ ప్రమాదానికి రోడ్డు మరమ్మతుల పనుల అలసత్వమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్–బీజాపూర్ రహదారి మరమ్మతుపనుల్లో భాగంగా అజీజ్నగర్ చౌరస్తాలో ఒకవైపు రోడ్డు పూర్తిగా తవ్వేశారు. దీంతో ఎనికేపల్లి చౌరస్తా నుంచి అజీజ్నగర్ చౌరస్తా వరకు నగరంవైపు వెళ్లే వాహనాలను కుడివైపు రోడ్డులో వెళ్లే విధంగా దారి మళ్లించారు. పదిహేను రోజులుగా ఇలా వాహనాలను దారిమళి్లంచడంతో ఒకవైపు రోడ్డులోనే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
అయితే గురువారం అర్ధరాత్రి నగరం వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం కుడివైపు రోడ్డులో వెళ్లింది. అజీజ్గనర్ చౌరస్తా వద్దకు వెళ్లగానే ఎడమ వైపు రోడ్డులో వెళ్లాల్సి ఉన్నా స్కార్పియో వాహనం కుడి వైపు రోడ్డులోనే వెళ్లడంతో గండిపేట చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టింది. రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న అధికారులు సరైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.