ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ పరీక్షల ప్రాంతీయ అధికారి బి.వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్స్, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతాయన్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 22,673 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,293 మంది హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థులను 40 నిమిషాలు ముందుగానే పరీక్ష హాలులోకి అనుమతించాలని వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు విజయరావు, రామలక్ష్మి, షా బాబా, హై పవర్ కమిటీ సభ్యులు ప్రభాకరరావు, బిల్లీ గ్రహం పాల్గొన్నారు.