బచా ఖాన్ ఉగ్రదాడిలో 21 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో బచా ఖాన్ యూనివర్సిటీపై తాలీబాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 21 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన 2014లో పెషావర్ ఆర్మీ పాఠశాలపై జరిగిన పాశవిక దాడిని తలపించేలా ఉందని పోలీసులు తెలిపారు.
పెషావర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని చార్ సదాలోని యూనివర్సిటీలోకి ఉదయం తరగతులు ప్రారంభం కాగానే ఉగ్రవాదులు పథకం ప్రకారమే ప్రవేశించారని డిప్యూటీ కమిషనర్ తాహిర్ జాఫర్ తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది తలలోకి బుల్లెట్లు దూసుకుపోవడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. దాడిలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌తో సహా పలువురు విద్యార్థులు మృతి చెందారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు నలుగురేనా.. ఇంకా ఉన్నారా అనే విషయమై బద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి.