బాబొస్తే.. బస్సులాపేస్తారా?
- సీఎం పర్యటన పేరుతో పల్లె సర్వీసుల రద్దు
- తీవ్ర అగచాట్లు పడ్డ కుగ్రామాల ప్రజలు
- చెప్పాపెట్టకుండా ఆపేయడం ఏంటని డీఎంపై మండిపాటు
కళ్యాణదుర్గం : సీఎం చంద్రబాబునాయుడు గురువారం పామిడికి వస్తున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కళ్యాణదుర్గం డిపోకు చెందిన 23 బస్సు సర్వీసులను రద్దు చేశారు. అయితే ఈ విషయం ప్రకటించకపోవడంతో వివిధ కుగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండులోనూ, మార్గమధ్యంలోనూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. నైట్ సర్వీసులు ఎంతసేపటికీ రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. 22 బస్సు సర్వీసులను రద్దు చేయడం వల్ల డిపో రూ.4.50 లక్షల ఆదాయం కోల్పోయిందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నాయకులు ముత్యాలన్న, గణపతి, పవన్ తదితరులు నిరసన తెలిపారు.
ప్రయాణికులు, ఈయూ నాయకులు కలిసి డిపో మేనేజర్ పెంచలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 200 బస్సు సర్వీసులను సీఎం పర్యటనకు కేటాయించడంతో ఆయా ప్రాంతాల్లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సీఎం సభకు బస్సులు తరలించాలని పైనుంచి ఆదేశాలు రాగానే సంబంధిత డిపో మేనేజర్లు కనీసం నోటీసు బోర్డు ద్వారా కూడా సమాచారం బహిర్గతం చేయకపోవడంపై మండిపడ్డారు. ఎంత సీఎం వస్తే మాత్రం చెప్పాపెట్టకుండా బస్సులు రద్దు చేస్తారా అని ప్రయాణికులు నిలదీశారు. దీనిపై డిపో మేనేజర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికే బస్సులు పామిడికి వెళ్లాల్సి ఉండటంతో సర్వీసులను రద్దు చేశామన్నారు. అయితే సిబ్బంది సహకరించకపోవడంతో పంపలేకపోయామని, గురువారం తెల్లవారుజాముకల్లా అక్కడికి చేరుస్తామని చెప్పారు.
రద్దయిన సర్వీసులు
బెంగళూరు(3 బస్సులు), అనంతపురం(1ఎక్స్‌ప్రెస్), వేపులపర్తి(1నైట్‌హాల్ట్), ముద్దినాయనపల్లి(1) ధర్మవరం(1), కుందుర్పి(3 అందులో 1 నైట్‌హాల్ట్), శెట్టూరు(1), గుంతకల్లు(1), రాయదుర్గం(1), ములకనూరు(1), ఓబిగానిపల్లి(1), పాళ్లూరు(1 నైట్‌హాల్ట్), జంబుగుంపల(1 నైట్‌హాల్ట్), చెళ్లికెర(1నైట్‌హాల్ట్), ఎరడికెర(1 నైట్‌హాల్ట్), శ్రీమజ్జనపల్లి(1 నైట్‌హాల్ట్), అమరాపురం(1), చెళ్లికెర (వయా) వేపులపర్తి(1).