మిషన్‌భగీరథ భేష్
మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబూరావు లోనికర్
మండలంలో వాటర్ గ్రిడ్ పనులను పరిశీలించిన మంత్రి
మునిపల్లి: మహారాష్ట్రలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని పనులు చేపడతామని మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రి బాబూరావు లోనికర్ అన్నారు. ఆదివారం బుస్సారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పనులను మహారాష్ట్ర తాగునీటి సరఫరా శాఖ మంత్రితో పాటు అక్కడి చీఫ్ ఇంజనీర్లు పరిశీలించారు.
మిషన్ భగీరథ పథకానికి తెలంగాణ ఇంజనీర్లు ఏ విధంగా రూపకల్పన చేశారో పూర్తి వివరాలను అడిగి తెలుసున్నారు. డిజైన్, పైపులైన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకెళ్తున్నారో స్వయంగా మ్యాపులను పరిశీలించారు. బుస్సారెడ్డిపల్లిలో మిషన్ భగీరథకు సంబంధించి ఏర్పాటు చేసిన మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశిలించారు. అనంతరం బుదేరా శివారు గుట్టపై ఏర్పాటు చేస్తున్న వాటర్ సప్లయి పంపులను పరిశీలించారు.
గుట్టపై నూతనంగా నిర్మించిన దేవాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్రలో కూడా మిషన్ భగీరథ పథకం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించిన తర్వాత తప్పకుండా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటానమన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాబూరావు లోనికర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో గత ఏడు సంవత్సరాలుగా అక్కడి ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సుమారు 600 గ్రామాల్లో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టిందో స్వయంగా పరిశీలించామన్నారు. మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మకంగా నిలుస్తుందని కొనియాడారు. సాగు, తాగునీటి సౌక్యర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు బాగున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే మహారాష్ట్రలో కూడా మిషన్ భగీరథ పథకం ప్రారంభిస్తామన్నారు.
మహారాష్ట్ర సీఎం దృష్టికి మిషన్ భగీరథ పథకం వివరాలను తెలియజేసి అక్కడ కూడా ఈ పథకం ప్రవేశ పెడతామన్నారు. ప్రస్తుతం 8 జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు. ముందు అక్కడ మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తామన్నారు. మహారాష్ట్ర మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపి అందరికి అమోదయోగ్యంగా ఉండేవిధంగా చూస్తామన్నారు. మొదటి విడతగా రూ.15 వేల కోట్లతో మహారాష్ట్రలో మిషన్ భగీరథ పనులు ప్రారంభిస్తామన్నారు.