ఉగ్రవాదం కేసులో శిశువుకు సమన్లు!
ఓ తాతయ్య అనుకోకుండా చేసిన పొరపాటు.. ఆయన మూడు నెలల మనవడికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. ఈస్టాగా పేరొందిన వీసా మాఫీ పత్రాల్లో సదరు తాతయ్య పొరపాటును ఓ ప్రశ్నకు 'నో' అని సమాధానం పెట్టేందుకు బదులు 'ఎస్' అని టిక్ చేశారు. అంతే అధికారులు కూడా ఏమాత్రం బుర్ర ఉపయోగించలేదు. ఏకంగా మూడు నెలల బాలుడికి సమన్లు పంపించడమే కాదు.. ఉగ్రవాద సంబంధాల కేసులో అతన్ని ప్రశ్నించడానికి రాయబార కార్యాలయానికి పిలిపించారు. ఈ విచిత్రమైన ఘటన లండన్లోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగింది.
తాతయ్య పౌల్ కెన్యన్ తన మూడు నెలల మనవడు హర్వీ కెన్యన్ను తొలిసారి విదేవీ పర్యటనకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా చిన్నారికి వీసా లేకుండా ప్రయాణానికి అవసరమైన ఈస్టా దరఖాస్తును ఆయన నింపాడు. అయితే, 'మీరు ఉగ్రవాద కార్యకలాపాలు, గూఢచర్యం, జాతి వ్యతిరేక కుట్ర లేదా సామూహిక హననానికి పాల్గొనాలనుకుంటున్నారా? లేక గతంలో పాల్పడ్డారా?' అన్న ప్రశ్నకు పౌల్ పొరపాటున ఎస్ అని పెట్టారు. అంతే, లండన్ నుంచి ఫ్లోరిడాలోని ఓర్లాండ్కు ఆ శిశువు ప్రయాణాన్ని నిలిపివేయడమే కాకుండా అతన్ని లండన్లోని అమెరికా రాయబారా కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు.
చేషైర్లోని పాయిన్టన్ నుంచి లండన్లోని రాయబార కార్యాలయానికి వచ్చేందుకు ఆ బాలుడి కుటుంబానికి పది గంటల సమయం పట్టింది. ఇక, అధికారుల ప్రశ్నల సమయంలో ఆ శిశువు ఏమాత్రం ఏడవకుండా శాంతంగానే ఉన్నాడని అతని తాత తెలిపాడు. ఈ ఘటన వల్ల ఆ చిన్నారి కుటుంబానికి 3వేల డాలర్లు అధిక వ్యయం కావడమే కాకుండా.. కుటుంబమంతా ఒకేసారి విదేశీ విహారానికి వెళ్లలేకపోయింది. మొదట తాత, అతని ఇంకో మనవరాలు అనుకున్న సమయానికి అమెరికా వెళ్లిపోగా.. కొడుకు కోసం ఆగిపోయిన తల్లిదండ్రులు కొన్నిరోజుల తర్వాత వెళ్లి వారిని కలుసుకున్నారు.