Bachelor of Education (BEd)
-
కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం
గోపాలపట్నం (విశాఖ పశ్చి): బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కళ్లెదుటే చోటుచేసుకున్న ఈ ఘోరాన్ని చూసి ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆదివారం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక భవానీనగర్‌కు చెందిన సమ్మిడి గీతాకుమారి (21) బీఈడీలో చేరేందుకు తండ్రి వెంకటరావుతో ద్విచక్రవాహనంపై ఎంవీపీ కాలనీకి బయలుదేరింది. ఎన్ఏడీ జంక్షన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత వెనుకనుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పింది. వెనుక కూర్చున్న గీతా కుమారి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. ఆమె నడుమ మీదుగా బస్సు వెళ్లిపోవడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకుపోయింది. కడుపు భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు వాహనంలో కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపు భాగంలో అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. వెంకటరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. గుండెలవిసేలా రోదన గీతా కుమారికి అన్న, తమ్ముడు ఉన్నారు. ఇంటికి ఒక్క ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెరిగింది. మా ఇంటి మహాలక్ష్మి కోల్పోయామని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బీఈడీ కోర్సులో చేరేందుకు థంబ్ వేసేందుకు ఎంవీపీ కాలనీకి వెళ్తుండగా యువతి ప్రమాదానికి గురైంది. -
బీఎడ్.. గో ఎహెడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కూడా బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనలను ఇటీవలే సవరించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న షరతు విధించింది. దీంతో 2011లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది. సీ–టెట్ నుంచే అమలు.. డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన అభ్యర్థులను ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై 7న నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల సీ–టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్సీటీఈ షరతుకు లోబడి డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన వారు ప్రైమరీ టీచర్ పోస్టులకు, 6, 7, 8 తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా సీ–టెట్ నిబంధనలను పొందుపరిచింది. దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియెట్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు, డీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) చివరి సంవత్సరం, డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే. వారితోపాటు తాజాగా డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి బీఎడ్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని నోటిఫికేషన్లో ఎన్సీటీఈ వెల్లడించింది. దీంతో బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్–1 పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు. మరోవైపు 6వ తరగతి నుంచి 8వ తరగతికి బోధించే టీచర్ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీతో డీఎడ్ పూర్తయిన వారు, ఇంటర్మీడియెట్‌తో నాలుగేళ్ల బీఈఎల్ఈడీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ వారు, ఇంటర్మీడియెట్‌తో ఇంటిగ్రీటెడ్ బీఎడ్ (బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ) పూర్తి చేసిన వారంతా అర్హులేనని పేర్కొంది. అలాగే డీఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా 6, 7, 8 తరగతుల బోధనకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంది. దీంతో వారు కూడా టెట్ పేపర్–2 పరీక్ష రాయవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో డీఎడ్ చేసిన వారిని టెట్ పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అయితే తమను పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవాలని డిగ్రీతో డీఎడ్ చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీ–టెట్ దరఖాస్తుల స్వీకరణను సీబీఎస్ఈ ప్రారంభించింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. 2010కి ముందు అర్హత ఉన్నా.. ఎన్సీటీఈ 2010లో టెట్ నిబంధనలను జారీ చేయకముందు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను కూడా అర్హులుగానే పరిగణన లోకి తీసుకునేవారు. అయితే బీఎడ్ అభ్యర్థులకు చైల్డ్ సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డీఎడ్ అభ్యర్థులు అంతకు ముందే కోర్టులో కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు డీఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనర్హులుగా ఎన్సీటీఈ ప్రకటించింది. ఆ తరువాత టెట్ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదన్న నిబంధన విధించింది. కేవలం 6, 7, 8 తరగతులకు బోధించేందుకే బీఎడ్ వారు అర్హులని పేర్కొంది. దీంతో బీఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మందికిపైగా ఉంటే డీఎడ్ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు అనేకసార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. -
బీఈడీకి జోష్
శాతవాహన యూనివర్సిటీ : కొంతకాలంగా విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపని బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుకు ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును రెండేళ్లకు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీట్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రూ.30 వేలు ఉన్న సైన్స్ సీటు ఇప్పుడు రూ.70 వేలు పలుకుతోంది. ఆర్ట్స్ విభాగంలో బీఈడీ సీటు రూ. లక్షల్లో పలుకుతోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే మేనేజ్మెంట్ సీట్లపై బేరసారాలు మొదలయ్యాయి. కళాశాలల యాజమాన్యాలు ఇదే అదనుగా భావిస్తూ రేట్లు పెంచుతున్నాయి. జిల్లాలో బీఈడీ సీట్లకు పెరిగిన డిమాండ్‌పై కథనం.. రెండేళ్ల కోర్సుతో.. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకానికి కేవలం డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో బీఈడీ కోర్సు ఆదరణ తగ్గింది. బీఈడీ కోర్సు నిర్వహణలో ఆర్థిక భారాన్ని డీఈడీ కోర్సుతో సర్దుకునేందుకు ఒకే ప్రాంగణంలో కళాశాలల యాజమన్యాలు ఈ రెండు కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఈడీ కోర్సు రెండేళ్ల ప్రతిపాదన రావడంతో ఇప్పుడు బీఈడీ సీట్లకు రెక్కలొచ్చాయి. రెండింతలు బీఈడీ కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్ల ధరలు గతం తో పోలిస్తే రెండింతలయ్యాయి. గతంలో మ్యాథ్స్, సై న్స్ సీట్లు దాదాపు రూ.30వేల నుంచి రూ.45 వేల వర కు పలికాయి. ప్రస్తుతం అవే సీట్లు రూ.70 వేలకు చేరా యి. ఆర్ట్స్ సీట్ల ధరలు వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే. కౌన్సెలింగ్ విషయంలో నేటికి స్పష్టత లేకున్నా అభ్యర్థులు మాత్రం ముందుగానే సీట్లను దక్కించుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని అనేక కళాశాలల్లో మహిళలు సీట్లు తీసుకునేందుకు శ్రద్ధ వహించడంతో యాజమాన్యాలు రేట్లు పెంచుతున్నాయి. కౌన్సెలింగ్‌పై సందిగ్ధత బీఈడీ కౌన్సెలింగ్‌పై ఇప్పటికీ అధికారిక ఉత్తర్వులు రాలేదు. గత నెల ప్రవేశాలు జరుగుతాయని భావించి నా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కౌన్సెలింగ్ విషయంలో అధికారిక ప్రకటన రాకముందు ఎప్పుడు నిర్వహించేది తేల్చలేమని కేయూ అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 విద్యాసంవత్సరం బీఈ డీ పరీక్షలు సెప్టెంబ ర్లో ఉన్నందున అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నా య ని బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో బీఈడీ కళాశాలల సీట్ల వివరాలు.. జిల్లాలో 19 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,940 సీట్లు ఉన్నాయి. ప్రతీ కళాశాలలో 20 శాతం సీట్లను కళాశాల మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునేందుకు అవకాశం ఉంది. రెండేళ్ల ప్రచారం నేపథ్యం లో కరీంనగర్‌తోపాటు శివారులోని బీఈడీ కళాశాలల్లో అధికంగా సీట్లు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. రంగంలోకి ఇతర రాష్ట్రాల పీఆర్వోలు స్వరాష్ట్రంలో సీటు రేటు అధికంగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఇతర రాష్ట్రాల బీఈడీ కళాశాలల పీఆ ర్వోలు జిల్లా వాసులను బుట్టలో వేసే పనుల్లో పడ్డారు. మా కళాశాలలో చేరితే రికార్డ్స్ రాయనవసరం లేదని, కళాశాలకు హాజరుకావాల్సి అవసరమే లేదని మభ్యపె డుతున్నారు. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాలలో హాస్టల్ వసతితో కలుపుకుని రూ.50 వేలతో కోర్సు పూర్తి చేయవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంగా లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. ప్రవేశాల క్రమంలో పీఆర్వోలు చెబుతున్నది ఒకలా ఉంటే.. పరీక్షల సమయంలో మరొకలా ఉండి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి.