ఆర్థిక రాజధానిలో ఆ ప్రదేశాలు మీకు తెలుసా?
ముంబైః ఎత్తైన కట్టడాలు, సినీతారల జిలుగువెలుగులు, స్టూడియోలు, ఖరీదైన మార్కెట్లు, గేట్ వే ఆఫ్ ఇండియాను చూస్తూ కనిపించే తాజ్ మహల్ హోటల్... ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై కలల నగరం. ప్రపంచానికి అమెరికా దేశం ఓ కలలా ఎలా కనిపిస్తుందో.. భారత దేశానికి ముంబై ఆలాంటిదనే చెప్పాలి. ఏడు ద్వీపాల నగరంగా కూడ ఆ నగరాన్ని పిలుస్తారు. అయితే అక్కడి కొన్ని అద్భుత స్థలాలను గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ విభిన్న ప్రాంతాలను గుర్తించడంలో మెట్రో నగరం... శ్రద్ధ తీసుకోవడం లేదు.
ముంబై ప్రజలు.. హాయ్ చెప్పే కన్నా ముందు చాయ్ అంటారనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఉదయం రాత్రి తేడా లేదు. జనసంద్రం నుంచీ దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఓ గుక్కెడు టీ తాగేందుకు అక్కడి జనం ఎంతో ఇష్టపడతారు. సముద్ర తీరంలో కూర్చొని ఒక్క సిప్ చాయ్ తాగి, ఒత్తిడినుంచి బయట పడుతుంటారు. ముంబైలోని మిడ్ నైట్ చాయ్, వర్లీ సీ ఫేస్ వంటి ప్రదేశాలు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. నగరంలో మరో ప్రధానమైన ప్రాంతం.. ధారవి కచ్చర్పట్టి. ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా ప్రసిద్ధి పొందిన ప్రాంతమది. అయితే చాలామంది సందర్శకులకు తెలియనిది అక్కడి ధారవి మార్కెట్. షాపింగ్ చేసేందుకు అదో ప్రధాన కేంద్రంగా చెప్పాలి. లెదర్ జాకెట్స్ నుంచి బ్యాగ్ ల వరకూ, ఫ్యాషన్ ఉపకరణాల నుంచి జ్యువెలరీ వరకూ ఏ వస్తువైనా ధారవిలో దొరికిపోవాల్సిందే.
బల్లార్డ్ ఎస్టేట్ లోని బ్రిటానియా కంపెనీ రెస్టారెంట్ దర్శించారంటే ఓ ప్రత్యేక అనుభూతి కలగక మానదు. అక్కడి ఇరానీ కేఫ్ లో 93 ఏళ్ళ వ్యక్తి... పర్షియన్ ఫ్లేవర్ తో రుచికరమైన టీ అందించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆ వయసులో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అక్కడ సేవలు అందించడం ముంబై నగరానికే వన్నె తెస్తుంది. అలాగే నగరంలోని క్వీన్స్ నెక్లెస్ పై కుంటుంబంతో సుదీర్ఘమైన డైవ్ అనుభవం.. హృదయాంతరాలను హత్తుకు పోతుంది. అక్కడ బ్యాచులర్స్ అందించే ప్రత్యేక సేవలకు తోడు... స్ట్రాబెర్రీ షేక్ తాగితే సందర్శకులు ఫిదా అయిపోవాల్సిందే. ముంబై మానియా భావాల్లో మరింత చైతన్యం నింపాల్సిందే.
ముంబై పశ్చిమ శివారు ప్రాంతం.. బాంద్రాలో చెట్ల నీడన నెలవైన విలక్షణ హెర్సెర్ఛ్ బేకరీ కూడ సందర్శకుల మనసును కట్టిపడేస్తుంది. ఆకర్షణీయమైన కుటీరాలతో విభిన్నంగా కనిపిస్తూ...ఆనందతీరాలకు చేరుస్తుంది. చెట్ల నీడన పక్షుల గూళ్ళను తలపించే కాటేజ్ లలో.. సాధారణ బర్గర్లు, ర్యాప్ లు మొదలైన భక్ష్య భోజ్యాలతోపాటు చల్లని నిమ్మరసం.. ఆత్మారాముడి ఆరాటాన్ని తీర్చడంతోపాటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ స్థలాన్ని సల్మాన్ ఖాన్ కూడ తరచుగా సందర్శిస్తుంటాడన్నవార్తలు ఉన్నాయి. ఇంకా ఆలస్యం దేనికి? ముంబై నగరంలో వేసవి విడిదికి సిద్ధమైపొండి మరి!