భక్తులకు అసౌకర్యం కలగొద్దు
పూర్తిస్థాయి రక్షణ ఏర్పాట్లు చేయాలి
అధికారులను ఆదేశించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
పలు పుష్కరఘాట్ల పరిశీలన
ధరూరు: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ రెమా రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె పెద్దచింతరేవుల, రేవులపల్లి, ఉప్పేరు, నెట్టెంపాడు ఘాట్లను పరిశీలించారు. పుష్కరస్నానానికి వచ్చే భక్తులకు రక్షణగా బారీకేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరికి ధీటుగా కృష్ణా పుష్కరాలను నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వరద నీటి కారణంగా ఆలస్యమవుతున్న పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం వరదనీటి ఉధృతి తక్కువగా ఉన్నదని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. సమయం సమీపిస్తోందని, అధికారులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. ఘాట్ల వద్ద తాగునీరు, స్నానపు గదులు, విద్యుత్, పార్కింగ్ వంటి సదుపాయాలపై ఆరీఓ అబ్దుల్ హమీద్, డీఎస్పీ బాలకోటీలతో చర్చించారు. కార్యక్రమంలో సీఐ సురేష్, ఎస్ఐ అమ్జదలి, తహసీల్దార్ సమద్ పాల్గొన్నారు.
బీచుపల్లి వద్ద పార్కింగ్ స్థలాల పరిశీలన
ఇటిక్యాల: బీచుపల్లి ఘాట్వద్ద వాహనాల పార్కింగ్ స్థలాలను ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రక్షణచర్యలు చేపట్టేందుకు పోలీసుశాఖ సిద్ధమమవుతోందన్నారు. బీచుపల్లి సమీపంలోని కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లిచౌరస్తా గ్రామాల శివార్లలోని వాహనాల పార్కింగ్ స్థలాలను గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్పీ పరిశీలించారు. వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలాలను చదును చేయడం, విద్యుత్ వెలుగులను ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసుశాఖ తరఫున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, చోరీలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర వాటిపై సమాయత్తం చేయాలన్నారు. బీచుపల్లి వద్ద పుష్కర విధులకు వచ్చే పోలీసు సిబ్బందికి వసతి ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు.