బీఆర్జీఎఫ్ లెక్కలు తేలుస్తున్న యంత్రాగం
సిద్దిపేట జోన్/ సిద్దిపేట రూరల్ న్యూస్‌లైన్: బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటుచేసుకున్న అక్రమాలే లక్ష్యంగా జిల్లా యంత్రంగం తీగ లాగుతోంది. అక్రమాల గుట్టువిప్పేందుకు సన్నద్ధమవుతోంది. నాలుగేళ్లుగా ప్రభుత్వ నిధుల వినియోగంపై అధికారిక లెక్కలను సేకరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించిన(బీఆర్జీఎఫ్) నిధులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. మూడేళ్లుగా సిద్దిపేట డివిజన్ పరిధిలో ఆయా మండలాల్లో బీఆర్జీఎఫ్ నిధుల కింద చేపట్టిన పనులు, వినియోగ ధృవీకరణ పత్రాలు, పెండింగ్ పనులు, మిగులు పనులు లాంటి సమగ్ర వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు సమాయత్తమైంది.
అందులో భాగంగానే జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ అనందంలు బుధవారం సిద్దిపేటలో రోజంతా డివిజన్ పరిధిలోని అధికారులతో సుధీర్ఘ సమీక్షను నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంలో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే పనికి శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగం ఆ దిశగా నిధుల వినియోగంపై ఆరా తీస్తోంది. ముందస్తుగా సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు మంజూరైన నిధుల వివరాలు, యూసీల సమాచారాన్ని మండలాల వారీగా సేకరించారు.
పెండింగ్ పనులపై ప్రత్యేక చర్చ
సిద్దిపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలాలకు కేటాయించిన బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై సమగ్ర వివరాలను సేకరిస్తున్న జిల్లా అధికారులు ముఖ్యంగా పెండింగ్ పనులపై దృష్టి సారించారు. గ్రామ సర్పంచ్ల పదవీకాలం ముగిసి కొత్త పాలక వర్గాలు అధికారంలోకి వ చ్చిన నేపథ్యంలో గత నాలుగేళ్లుగా ఆయా గ్రామాల్లో బీఆర్జీఎఫ్ కింద నిలిచిన పనుల వివరాలను, పెండింగ్ నిధులను మండల అధికారుల ద్వారా సేకరించారు. త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తిచేయాలని, బ్యాంకుల్లో నిధులు నిల్వ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, పనులు సకాలంలో పూర్తి చే యకపోవడంతో సంబంధిత నిధులు వెనక్కివె ళ్లే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
ముఖ్యంగా బీఆర్జీఎఫ్ నిధులు నిర్వీర్యం కాకుండా చూడాలని ఆదేశించారు. మండలాలవారీగా బీఆర్జీఎఫ్ నిధుల వినియోగంపై వివరాలు సేకరించిన జిల్లా అధికారులకు డివిజన్ పరిధిలోని ఒక మండలంలో అధికారికంగా లెక్కలకు పొంతన కుదరలేదన్న అభిప్రాయం వెలిబుచ్చినట్లు సమాచారం. ఈ సమీక్షలో మండల పరిధిలోని డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.