‘తలసరి’లో వెనుకబడిన రాష్ట్రం
- రూ.20 వేలు ఎక్కువగా తెలంగాణ
- మరోవైపు పెరుగుతున్న అప్పు
సాక్షి, అమరావతి: తలసరి ఆదాయంలో రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలు ఏపీకన్నా ముందుస్థానాల్లో ఉండటం గమనార్హం. తెలంగాణ తలసరి ఆదాయం ఏపీకన్నా సుమారు రూ.20 వేలు ఎక్కువగా ఉంది. మరోవైపు ఏపీలో తలసరి అప్పు మాత్రం పెరుగుతూ పోతోంది. అదే సమయంలో తలసరి వ్యయం అప్పు కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. రెండురోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016–17కు చెందిన రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని విడుదల చేశారు. మహారాష్ట్ర, హర్యాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో వెనుకబడింది. పంజాబ్ తలసరి ఆదాయం రూ.1,26,063 కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,40,683, ఏపీ తలసరి ఆదాయం రూ.1,22,376గా ఉంది.
జిల్లాల ఆర్థిక ముఖచిత్రం విడుదల
ఆదాయంలో (జిల్లాల స్థూల ఉత్పత్తి) కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా విజయనగరం, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తితో పాటు ఏ ఏ రంగాల్లో ఏ ఏ జిల్లాలు ఏ స్థానంలో ఉన్నాయనే వివరాలు (2016–17) కూడా చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ ఆదాయంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. పారిశ్రామిక రంగ ఆదాయంలో విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సేవా రంగంలో విశాఖ తొలి స్థానంలో ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఇక తలసరి ఆదాయంలో కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలు జిల్లాలు మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయి.