రక్షణ మీరే!
మన కుటుంబం ఎప్పుడూ దాడులకు గురవుతూనే ఉంటుంది. బ్యాక్టీరియాలూ, వైరస్లు, మాన్సూన్ మార్పులూ, వ్యాధులతో ఎటాక్ మీద ఎటాక్ మీద ఎటాక్ జరుగుతూనే ఉంటుంది. రాబోయే 2019లో కుటుంబానికి రక్షణ మీరే. కుటుంబాన్ని ఆరోగ్యంగా కొత్త ఏడాదిలోకి తీసుకెళ్లడానికి మీ కోసం ఈ సూచనలు.
చాలా రకాల జబ్బుల్ని చిన్న చిన్న నివారణ మార్గాలతోనే రాకుండా చేసుకోవచ్చు. జబ్బు కంటే నివారణ ఎప్పుడూ మంచిదే కదా! ఇక్కడ కొన్ని సాధారణ జబ్బులకు నివారణ మార్గాలు...
ఆర్థరైటిస్ నివారణకు...
ఆర్థరైటిస్ సమస్యను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అవి... బరువు పెరగకుండా చూసుకోవాలి. శరీర కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని చేసే వృత్తుల్లో ఉండేవారు వారంలో కనీసం ఐదు రోజులు 30 నిమిషాలు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయాలి. కీళ్లు అరిగే అవకాశం ఉన్నవారు కీళ్లకు తగినంత విశ్రాంతి కల్పించాలి. వేగంగా పరుగెత్తే వ్యాయాయం చేసేవారు తమ స్పోర్టింగ్ యాక్టివిటీస్‌ను తగ్గించచాలి. (దానికి బదులు వేగంగా నడవడం, ఈదడం మంచిది). కాళ్లు మడిచి, బాసిపట్లు వేసి కూర్చోవడం మంచిది కాదు. వీలైనంత వరకు కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద కూర్చోవాలి. పాల వంటి క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మెనోపాజ్ వచ్చిన మహిళల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కీళ్లలో నొప్పి కనిపించినప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
కిడ్నీల్లోని రాళ్ల నివారణ...
∙సమ్మర్లో మనం తాగే నీళ్లు పెరిగినా ఒంట్లో నీళ్లు తగ్గుతాయి. ఈ పరిస్థితి వల్ల ఏర్పడే అనర్థాల్లో ప్రధానమైనది మూత్రపిండాల్లో రాళ్లు. ఈ పరిస్థితిని నివారించడానికి నీటిని ఎక్కువగా తాగాలి. మనం సగటున రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి.
∙ఆహారంలో ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి.
∙రాళ్లు వచ్చేందుకు కారణమయ్యే ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి.
∙క్యాల్షియం సప్లిమెంట్లు కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.
∙ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దాంతో క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. అందుకే ఆల్కహాల్ చాలా పరిమితంగా తీసుకోవాలి. మానేస్తే ఇంకా మంచిది.
∙కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు.
గౌట్
బొటనవేలు బిగుసుకుపోయినట్లు కావడం, కీళ్ల మధ్య రాయిలా మారడంతో కనిపించే వ్యాధి గౌట్. గతంలో మాంసాహారం తీసుకునే సంపన్న వర్గాల్లో కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మారిన ఆహార
అలవాట్ల వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మాంసాహారం, మద్యంలో పూరిన్స్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని పోషకాల్లాగానే ఇవి కూడా శారీరక కార్యకలాపాల్లో పాలుపంచుకుని కణంలోకి పూర్తిగా శిథిలమైపోవాలి. ఆ ప్రక్రియ సరిగ్గా జరగకపోతే రక్తంలోకి కొన్ని వ్యర్థాలు విడుదల అవుతాయి. అందులో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. కొందరిలో యూరిక్ యాసిడ్ కీళ్ల మధ్యన చేరి రాయి (క్రిస్టల్)లా గట్టిగా మారిపోయి కీలును దెబ్బతీస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి వస్తుంది. అలా కీళ్లలో తీవ్రమైన బాధ కలిగిస్తుంది ఈ గౌట్. గౌట్ నివారణ కోసం ఆహార నియమాలు...
∙మాంసాహారం ముఖ్యంగా వేటమాంసం (రెడ్ మీట్), పోర్క్, సీ ఫుడ్స్ లాంటి ఎక్కువ క్యాలరీలు ఇచ్చే ఆహారం (హై క్యాలరీ డైట్) బాగా తగ్గించాలి.
∙ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి.
∙స్వీట్స్, సాఫ్ట్‌డ్రింక్స్, ఆలూ (పొటాటోస్), ఐస్క్రీమ్స్లోని కొన్ని పదార్థాల వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
∙పాలు, మజ్జిగ వంటి డైరీ ఉత్పాదనలు రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని విరివిగా తీసుకోవాలి.
తలనొప్పి నివారణ కోసం...
తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. కంప్యూటర్ వర్క్ చేసే వారు కంటికి ఒత్తిడి కలగకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించాలి. ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు రిలాక్స్ అవాలి. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా చూడటం సరికాదు.
∙కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు... అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్లు చేస్తూ కంటిని ఒత్తిడికి గురి చేసేవారు మన పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.
∙పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.
∙నిద్ర మరీ ఎక్కువైనా తలనొప్పి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రపోవడం మంచిది.
∙పడని పదార్థాలు తీసుకోవడం ఆపేయాలి.
∙ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయాలి.
∙కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా పదార్థాలను తీసుకోవడం మానేయాలి. కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలు అవాయిడ్ చేయడం అవసరం.
∙ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి చేయడం సరికాదు.
∙ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం సరికాదు.
∙రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల కొన్ని తలనొప్పులను నివారించవచ్చు.
జలుబు
సాధారణ జలుబును కలగజేసే వైరస్ జన్యుస్వరూపం వెంటవెంటనే మారిపోతుంటుంది కాబట్టి దీని నివారణకు మందు రూపొందించడం సాధ్యం కాదు. అయితే దీనివల్ల ఎలాంటి ముప్పూ లేకపోయినా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీని నివారణ అవసరం. మిగతా వైరల్ రోగాలలాగే జలుబుకి ప్రత్యేకించి చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను అనుసరించి మందులు వాడాలి. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలి. మిగతా వారితో కలవకూడదు. పారాసిటమాల్ వంటి జ్వరం తగ్గించే మందులు వాడాలి.
∙ఈ వ్యాధి సంక్రమించినవారు సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు దూరంగా ఉండాలి.
∙జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
గమనిక: మిజిల్స్, మంప్స్, రూబెల్లా, పోలియో లాంటివి కూడా వైరస్ల వల్ల వచ్చే జబ్బులే. అయితే వీటికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టీకాతోనే వాటి పూర్తిస్థాయి నివారణ సాధ్యం.
క్యాన్సర్ నివారణ... సింపుల్ మార్గాలు!
క్యాన్సర్ అంటేనే చాలా మంది వణికిపోతుంటారు. కానీ అంతగా భయపెట్టే వ్యాధికి కూడా కొన్ని నివారణలు ఉంటాయి. ముదురు రంగు (డార్క్) చాక్లెట్లు: కోకో ఎక్కువగా ఉండే ముదురు రంగు చాక్లెట్లు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. వీటిలోని పెంటామెర్ అనే ఫ్లేవనాయిడ్స్‌కు క్యాన్సర్‌ను హరించే గుణం ఉంది. ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తీసుకోకపోవడం: పిజ్జాలు, బర్గర్లు, పఫ్‌ల వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పాటు చక్కెర ఎక్కువగా ఉండే బేకరీ ఐటమ్స్‌ను తీసుకోకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలుగా వాడే నూనెల వంటి పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువ. అదే సంప్రదాయ వంటకాలతోక్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ.
∙కార్సినోజెన్స్‌కు దూరంగా ఉండటం: కార్సినోజెన్ అంటే క్యాన్సర్‌ను కలిగించేది అని అర్థం. సిగరెట్ పొగలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు (కార్సినోజెన్స్) చాలా ఎక్కువ. అలాగే మద్యం ఎక్కువ మోతాదుల్లో తీసుకోవడం కూడా దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఇక పొగాకు, గుట్కా వంటివి కూడా క్యాన్సర్ కారణాలని స్పష్టంగా తెలుసు. వాటికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది కార్సినోజెన్ అవుతుందని గుర్తించాలి. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ వాడకూడదు.
∙వ్యాయామం చేయడం: శరీరానికి కదలికలు లేకుండా ఉండే జీవనశైలి క్యాన్సర్‌కు కారణాల్లో చాలా ప్రధానమైనది. వ్యాయామం మనలోని వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తుంది. అందుకే వ్యాయామాన్ని తప్పనిసరిగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల మనలో కొన్ని ఆరోగ్యకరమైన ఎంజైములు, రసాయనాలు ఊరి అవి మనలో వ్యాధినిరోధకశక్తిని మరింత శక్తిమంతం చేస్తాయి.
∙కంటి నిండా నిద్ర: అలసిన అన్ని కండరాలూ పూర్తి శక్తిని పుంజుకోవాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. క్రమం తప్పకుండా ఒకేవేళకు పడుకుని ఒకేవేళకు లేచే మంచి అలవాటు, కంటికి నిండైన నిద్ర... మనలోని అంతర్గత ఎంజైములు స్రవించే ‘ఎండోక్రైన్ వ్యవస్థ’ను మరింత ఆరోగ్యకరంగా ఉంచుతాయి. మన ఆరోగ్యకరమైన ఎండోక్రైన్ వ్యవస్థ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతో అన్ని రకాల క్యాన్సర్లు దూరంగా ఉంటాయి.
∙వెల్లుల్లి: ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లిలో క్యాన్సర్లతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. వెల్లుల్లి మన రోగనిరోధక వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. అందుకే వెల్లుల్లితో తీసుకోదగిన ప్రతి వంటపదార్థంలోనూ వాటిని బాగా వాడేలా చూసుకోండి. ప్రధానంగా అది జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక (ముఖ్యంగా పొట్ట, పెద్దపేగు) క్యాన్సర్లను నివారిస్తుంది.
∙బ్రకోలీ: ఇప్పుడు మన సూపర్మార్కెట్లలో దొరికే బ్రకోలీ అనే ఆకుకూర కూడా క్యాన్సర్ల నివారణకు బాగా తోడ్పడుతుంది. అందుకే దాన్ని సూపర్‌ఫుడ్ అని అభివర్ణిస్తుంటారు. అయితే దీన్ని మైక్రోవేవ్ ఓవెన్లో వండితే అందులోని క్యాన్సర్‌తో పోరాడే ఫ్లేవనాయిడ్స్ నశిస్తాయి. అందుకే దీన్ని ఉడికించి తినడం లేదా వీలైతే కొత్తిమీరలా పచ్చిగా తినడం కూడా చాలా మేలు చేస్తుంది.
∙తాజాపండ్లు: దానిమ్మ, నేరేడు వంటి పండ్లను తినడం క్యాన్సర్లను నిరోధిస్తుంది. ఏ సీజన్లో లభ్యమయ్యే పండ్లను ఆయా సీజన్లలో తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరిగి క్యాన్సర్లను నివారిస్తుంది.
∙మధ్యధరా తీరవాసుల జీవనశైలి: యూరప్‌లోని మధ్యధరా తీరవాసుల జీవనశైలి ప్రపంచంలోనే చాలా చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిగా పేరొందింది. మధ్యధరా తీరంలో ఉండే దేశాలన్నింటినీ కలిపి
‘ప్రపంచపు పండ్లబుట్ట’గా చెబుతారు. మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ఉండే అన్ని దేశవాసులు తమ ఆహారంలో పండ్లను చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందుకే ఆ ప్రాంతానికా పేరు. పళ్లతో పాటు వాళ్లు ఆకుకూరలు, చేపలు, ఆలివ్ ఆయిల్, పొట్టుతో ఉండే ధాన్యాలు, బీన్స్ వంటి లెగ్యూమ్స్, నట్స్ వంటివి వాళ్ల ఆహారంలో ఎక్కువ. ఈ తరహా ఆహారపు అలవాట్లు ఉండి, పొగాకు వాడకానికి దూరంగా ఉంటే చాలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు 60 శాతం పడిపోతాయని చెబుతున్నారు ఆండర్సన్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ లొరెంజో కోహెన్.
∙బరువు తగ్గించుకోవడం: ప్రపంచవ్యాప్తంగా సంభవించే క్యాన్సర్ మరణాల్లో అత్యధికం బరువు ఎక్కువగా ఉండేవారిలోనే అన్నది నిజం. మహిళలు బరువు పెరుగుతున్నకొద్దీ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఈస్ట్రోజెన్ పెరగడం రొమ్ముక్యాన్సర్, యుటిరైన్ క్యాన్సర్‌కు దోహదం చేస్తుంది. అందుకే తమ బరువును అదుపులో ఉంచేలా ప్రతిఒక్కరూ వ్యాయామాలు చేయడం అవసరం.
∙నోరు పరీక్షించుకుంటూ ఉండటం: ప్రతి ఆర్నెల్లకు ఒకసారి డెంటిస్ట్ చేత నోటిని పరీక్షింపజేసుకుంటూ ఉండటం అవసరం.
∙మహిళలు సొంతంగా రొమ్ము పరీక్షించుకుంటూ ఉండటం: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. కాబట్టి ప్రతిసారీ రుతుస్రావం ముందర తామే సొంతంగా రొమ్ములను పరీక్షించుకుంటూ ఉండాలి. వాటిల్లో తేడాలేమైనా ఉంటే గమనించే ఈ పరీక్షను సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అంటారు. రొమ్ముల్లో గడ్డలుగానీ, నొప్పి లేదా సలపరంగానీ, నిపుల్ లోపలకు ముడుచుకుపోయినట్లుండటం గానీ లేదా నిపుల్ నుంచి ఏమైనా స్రావాలు వస్తుంటే మాత్రం వెంటనే వైద్యనిపుణులను కలవాలి.
∙హెపటైటిస్–బి వ్యాధి ఆ తర్వాతి కాలంలో కాలేయ క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవితాంతం ఆ వ్యాధి నుంచి రక్షణ దొరుకుతుంది.
∙మహిళల్లో హెచ్‌పీవీ వైరస్ వల్ల గర్భాశయముఖద్వార క్యాన్సర్ (సర్విక్స్ క్యాన్సర్) వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్లలో దీనికి టీకా అందుబాటులో ఉంది. వైవాహిక సంబంధాల్లోకి వెళ్లని ప్రతి మహిళా ఈ వ్యాక్సిన్‌ను తీసుకుంటే అది సర్విక్స్ క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణ
∙వుంచి సవుతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి విటమిన్–డి అందేలా జాగ్రత్తపడాలి.
∙కొవ#్వ పదార్థాలు (యానివుల్ఫ్యాట్, నెయ్యి) వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
∙బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి పోషకాలు శరీరానికి అందేలా క్యారెట్, టమోటా వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
∙పొగతాగడానికి, వుద్యపానానికి దూరంగా ఉండాలి.
మలబద్దకం నివారణ
∙పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముడిబియ్యం (దంపుడు బియ్యం), ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకునే వారిలో మలబద్దకం సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచుపదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీ స్పూన్ల తవుడు తీసుకుంటుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.
∙ప్రతిరోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నమలకుండా మింగాలి. ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మృదు విరేచనకారిగా పని చేస్తుంది.
∙బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస... మొదలైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
∙వ్యాయామం కూడ మలబద్దకం నివారణకు తోడ్పడుతుంది. అన్ని కండరాల్లాగే పేగుకండరాలకూ చురుకుదనం సమకూరి మలబద్దకం నివారణ జరుగుతుంది.