మట్టి గనిలో బంగారం
మనిషిలోని మంచి
స్కాట్బెండ్ అనే చిన్న ఊళ్ళో పుట్టిన ఆండ్రూ కార్నెగీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసాక అమెరికాలోని అతి పెద్ద స్టీల్ తయారీదారు అయ్యాడు. తరచూ ‘మనుషులే నా పెట్టుబడి’ అనేవాడు. ‘‘మనుషులతో వ్యవహరించడం బంగారు గనుల్లో తవ్వడం లాంటిది. టన్నుల కొద్దీ మట్టిని తవ్వి ప్రతీ అణువునీ పరిశీలిస్తూంటేనే ఎక్కడో ఓ ఔన్స్ బంగారం కనపడుతుంది. గని కార్మికుడికి కళ్ళ ముందు కనపడేది మట్టే అయినా అతను వెదికేది బంగారమే.
ఇలాగే మనుషుల్లోని చెడ్డ గుణాలని పట్టించుకోకుండా వారిలోని మంచి గుణాల కోసం చూస్తే అవి తప్పక కనిపిస్తాయి. మనుషుల్లోని చెడ్డ గుణాలని చూసి వారిని చెడ్డ వారిగా అంచనా వేసే బదులు, వాళ్ళలోని మంచి గుణాలని చూసి వాళ్ళని మంచి వాళ్ళుగా భావించడం అనే ఛాయిస్ మన చేతుల్లోనే ఉంది.
ఎంత మట్టి వచ్చినా దాన్ని బంగారు గని అంటారు కాని మట్టి గని అనరుగా?’’ అని చెప్పేవాడు కార్నెగీ. ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇది చక్కటి బోధ. రమణ మహర్షిని బాధించిన ఓ తాగుబోతైన దుర్మార్గుడు మరణించాడని ఎవరో ఆయనకు చెప్తే, ‘అతను నిత్యం సాయంత్రం తప్పక స్నానం చేసేవాడు’ అని ఆ తాగుబోతులోని మంచి లక్షణాన్ని గుర్తు చేసారు.