సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
తెనాలిరూరల్: తెనాలిని బ్యాడ్మింటన్ హబ్‌గా మార్చేందుకు ఉన్న అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. చెంచుపేట అమరావతి ప్లాట్స్‌లోని ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నేపథ్యంలో ఆర్డీవో జి.నరసింహులు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్ వంటి వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి పున్నయ్యచౌదరి మాట్లాడుతూ తెనాలి స్టేడియంలో ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీలు నిర్వహించేదుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలు రెండు విభాగాలుగా ఉంటాయని పేర్కొన్నారు. వాటిలో అండర్–13, అండర్15 పోటీల్లో బాలబాలికలు పాల్గొనవచ్చన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గుర్తింపు పొందినవారు అర్హులుగా చెప్పారు. శాప్ ఓఎస్టీ రామకృష్ణ మాట్లాడుతూ స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ గుంటూరు కార్యదర్శి సంపత్‌కుమార్, గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి శ్రీనివాసరావు, కమిషనర్ కె.శకుంతల, జెడ్పీటీసీ ఎ.జయలక్ష్మి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.