బహీరా వినిపించిన భవిష్యవాణి
చిన్నారి ముహమ్మద్ (స)ను సమీపించాడు బహీరా. తన స్థాయిని, హోదాను, అధికారాన్ని పక్కనబెట్టి నేలపైనే కూర్చున్నాడు. క్షేమ సమాచారం అడిగాడు. అనేక ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ చిన్నారి ముహమ్మద్ (స) సరైన, సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడంతో బహీరా అమితానందభరితుడయ్యాడు.
భావిప్రవక్తగా చిన్నారి ముహమ్మద్ (స)ను మనసులోనే విశ్వసించాడు.
అబూతాలిబ్ నుద్దేశించి, ‘ఈ చిన్నారి మీకేమవుతాడు’ అని ప్రశ్నించాడు బహీరా.
‘మా అబ్బాయే. అన్నాడు అబూతాలిబ్.
ఇకనుండి ఈ చిన్నారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ యూదులకంట పడనీయకండి. దైవసాక్షిగా చెబుతున్నా. వారు ఇతన్ని చూసినా, ఇతని విషయంలో నేను తెలుసుకున్న విషయాలు వారు కూడా తెలుసుకున్నా ఈ చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడినట్లే.
‘అంటే..?’
‘అంటే ఏమిటి? నా కొడుకండీ బాబు’ అన్నాడు అబూతాలిబ్ . ‘కానీ, ఇది అసంభవం. ఈ చిన్నారి మీ కొడుకా. ఇతని తండ్రి బతికి ఉండే అవకాశాల్లేవు’ అన్నాడు బహీరా దృఢనిశ్చయంగా.
‘అదేమిటి? అంతనమ్మకంగా ఎలా చెప్పగలరు?’ అబూ తాలిబ్ నిజంగానే ఆశ్చర్యచకితులయ్యారు.
‘ఈ చిన్నారిని చూసి, ఇతనితో మాట్లాడిన తరువాత, గ్రంధజ్ఞానం వెలుగులో సమీక్షించుకొని చెబుతున్నాను’ అన్నాడు బహీరా మరింత నమ్మకంగా.
చిన్నారి ముహమ్మద్ (స) విషయంలో అతడి అవగాహనకు అబ్బురపడ్డాడు.
‘అవును, ఇతను నా సోదరుని కొడుకు. నేనితని బాబాయిని’.
‘మరి ఇతని తండ్రి?’
‘‘ఈ పిల్లవాడు తల్లిగర్భంలో ఉన్నప్పుడే నా సోదరుడు అబ్దుల్లాహ్ చనిపోయాడు’’.
‘మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. ఇకనుండి ఈ చిన్నారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ యూదులకంట పడనీయకండి. దైవసాక్షిగా చెబుతున్నా. వారు ఇతన్ని చూసినా, ఇతని విషయంలో నేను తెలుసుకున్న విషయాలు వారు కూడా తెలుసుకున్నా ఈ చిన్నారి ప్రాణం ప్రమాదంలో పడినట్లే. జాగ్రత్తగా చూసుకోండి. మీ అబ్బాయి మహా పురుషుడవుతాడు. మహిమాన్వితు డవుతాడు’ అన్నాడు బహీరా.
తరువాత, చిన్నారి ముహమ్మద్ విషయంలో తన అంచనా నిజమైనందుకు ఆనందంతో పొంగిపోతూ వారినుండి సెలవు తీసుకున్నాడు.
సిరియా ప్రయాణం ముగించుకొని మక్కాకు చేరుకున్న అబూతాలిబ్‌కు బహీరా మాటలే మనోమస్తిష్కాల్లో సుడులు తిరుగుతున్నాయి. చిన్నారి ముహమ్మద్ (స) విషయంలో బహీరా వినిపించిన భవిష్యవాణి చెవుల్లో మార్మోగుతోంది. ఆలోచనలు పరిపరివిధాలా పరుగులు పెడుతున్నాయి. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు)