మహానది మహోగ్రరూపం
ఒడిశాలో కొనసాగుతున్న వరద బీభత్సం
34కు చేరిన వరద మృతులు..
పొంగిపొర్లుతున్న మహానది, వైతరణి నదులు
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మహానది, వైతరణితో పాటు అనేక నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 34 మంది వరదల కారణంగా మరణించారు. బుధ, గురువారాల్లోనే ఏడుగురు చనిపోయినట్టు తెలిసింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి.
23 జిల్లాలోని 1,553 గ్రామాల్లోని 9.95 లక్షల మంది ప్రజలు ముంపు ప్రభావానికి గురయ్యారని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే మహాపాత్ర తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయని, అనేక ప్రాంతాల్లో మహానది, దాని ఉపనదులు ఉధుృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పారు. నారజ్, జోబ్రా, డాలిగాయి మొదలైన ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయని, ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశామని తెలిపారు.
కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపర, ఖుర్దా, పూరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని, జాజ్పూర్, భద్రక్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1.11 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించామని, వీరికి ఆహారం అందించేందుకు 240 వంట శాలలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుమారు 400 గ్రామాల్లో రెండున్నర లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు వివరించారు.