ఘనంగా నవమి ఉత్సవాలు
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం ప్రారంభమైన ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కడప నగరంలోని పలు రామాలయాల్లో ఉదయం స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కన్నులపండువగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వివిధ రకాల పూజోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు నామార్చనలు, భజనలు నిర్వహించారు.
స్థానిక రవీంద్రనగర్‌లోని శ్రీసీతారామస్వామి ఆలయంలో ఈ వేడుకల సందర్భంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పల్లకీపై శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను అలంకరించి స్థానిక వీధుల్లో ఊరేగించారు.
ఈ సందర్భంగా భక్తులు పూజాద్రవ్యాలు సమర్పించి స్వామి, అమ్మవారలకు మొక్కుకున్నారు. నిర్వాహకులు ఆలయం వద్ద స్వామి తీర్థప్రసాదంగా వడపప్పు, పానకం అందజేశారు. 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా రాజశేఖర్, చల్లా అనిల్, యువ నాయకులు పవర్ బాలాజీ, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, శ్రీను, వెంకట్, ఖలీల్, షఫి, రవీంద్రనగర్ యువజన సంఘం, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.