బజ్పే విమానాశ్రయంలో పేలుడు పదార్థాల కలకలం
సాక్షి, బెంగళూరు : మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. దుబాయ్‌కు వెళుతున్న ఓ వ్యక్తి లగేజీలో అనుమానిత ద్రావకాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. వివరాల్లోకి వెళితే... పేలుడు పదార్థాలతో దుబాయ్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళితే... అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి దుబాయ్‌కు వెళ్లేందుకని శనివారం రాత్రి 11.30 గంటలకు మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో అతని లగేజీలో రసాయనిక ద్రావణం, బ్యాటరీ, వైర్లు ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించింది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ హితేంద్ర, డీసీపీ జగదీష్ విమానాశ్రయాన్ని చేరుకుని నిందితుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులోని వివరాల ప్రకారం అతనిది కేరళ అని నిర్ధారించారు. మంగళూరు నుంచి దుబాయ్‌కు అక్కడి నుంచి సిరియా వెళ్లడానికి అబ్దుల్ ఖాదర్ ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. కేసు విచారణకు గాను బెంగళూరు నుంచి ప్రత్యేక బృందం మంగళూరుకు చేరుకుంది. దుబాయ్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న తాను ఇటీవల స్వగ్రామానికి వచ్చినట్లు విచారణ అధికారుల ఎదుట అబ్దుల్ ఖాదర్ అంగీకరించాడు.
శనివారం దుబాయ్‌కు బయలుదేరానని, ఆ సమయంలో తన ఇంటి పక్కనే ఉన్న వారు ఓ గిఫ్ట్ ప్యాక్‌ను దుబాయ్‌లోని తమ సంబంధీకులకు ఇవ్వాలని కోరుతూ ఇచ్చారని వివరించాడు. గిఫ్ట్ ప్యాక్‌ను అధికారులు పరిశీలించారు. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫెయిల్యూర్ అయిన బ్యాటరీ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చి అబ్దుల్ ఖాదర్‌ను విడిచి పెట్టారు.