దేవునిపై విశ్వాసానికి ప్రతీక బక్రీద్
ఇద్గాల వద్ద సందడి
కల్హేర్: భగవంతునిపై నమ్మకం, విశ్వాసంతో బక్రీద్ పండుగను జరుపుకోవడం ముస్లింల ఆనవాయితీ. సమత, మమతలు నింపే బక్రీద్‌ను మంగళవారం జరుపుకునేందుకు ముస్లింలు సన్నద్ధమయ్యారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, గజ్వేల్, జోగిపేట, పటాన్చెరు, సదాశివపేట, జహీరాబాద్, నర్సాపూర్, నారాయణఖేడ్ పట్టణాల్లో బక్రీద్ సందడి నెలకొంది. ముస్లింలు బక్రీద్ పండుగను ఇస్లామ్ క్యాలండర్ ప్రకారం ‘జిల్హిజ్జ’ మాసం పేరుతో జరుపుకుంటారు. గ్రామశివార్లలోని ఈద్గాల వద్దకు వెళ్లి నమాజు ఆచరిస్తారు.
బక్రీద్ ప్రత్యేకత...
హజ్రత్ ఇబ్రహీం అలై సలాం ‘ఖుర్బానీ’ సమర్పించేందుకు భగవంతుడు ‘అజ్మాయిష్’ (విశ్వాస పరీక్ష) పెట్టడంతో బక్రీద్ పండుగ జరుపుకునేందుకు ప్రధాన కారణం. హజ్రత్ ఇబ్రహీం అలై సలాం తన కొడుకు ఇస్మాయిల్ అలై సలాంను ఖుర్బానీ ఇచ్చేందుకు సిద్ధమై దేవుడి విశ్వాసాన్ని చూరగొంటారు. కొడుకును ఖుర్బానీ ఇస్తున్న క్రమంలో దేవుడు స్వర్గం నుంచి హజ్రత్ ఇబ్రహీం అలై సలాం వద్దకు ఓ ‘దుంబ’ (పొట్టెలు) పంపడంతో ఇస్మాయిల్ అలై సలాంకు ఖుర్బానీ నుంచి విముక్తి లబించిందని చెబుతారు. దీంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకుని ప్రతి ఏటా (పొట్టెలు, మేకపోతు, ఒంటెలతో) ఖుర్బానీ ఇస్తారు. తమ మతస్తులకు ఖుర్బానీ ద్వారా మాంసం అందజేస్తారు.
ఇస్లాం పయనం ఇలా..
ఇస్లాం మతం ఐదు ముఖ్య మూలస్తంభాలపై పయనిస్తుంది. అందులో మొదటిది ‘కల్మా’ (దేవుణ్ని విశ్వసించడం), రెండోది ప్రతిరోజు ఐదుసార్లు నమాజ్ ఆచరించడం, మూడోది రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించడం, నాలుగోది ‘జకాత్’ రూపంలో పేదలకు దానధర్మాలు చేయడం, ఐదోది ‘హజ్’ (మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం) యాత్ర చేయడం. ఈ ఐదు సూత్రాలను ముస్లింలు పాటిస్తారు. బక్రీద్ నేపథ్యంలో పాటించే పద్ధతులు విజయవంతమైన జీవనం కోసం హజ్ యాత్ర చేస్తారు.
బక్రీద్ పండుగ గొప్పది: సయ్యద్ షిరీన్ మోలిసాబ్, కల్హేర్
బక్రీద్ పండుగ చాలా గొప్పది. పండుగ నియమాలు పాటించాలి. ఖుర్బానీ ఇవ్వడం ముస్లింల ఆనవాయితీ. ఆర్థిక స్థోమతను బట్టి పవిత్ర మక్కా క్షేత్రాన్ని దర్శించుకుని హజ్ యాత్ర చేస్తారు.