
సాక్షి హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు పలు నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మత గురువులకు ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు ఒకటో తేదీన (శనివారం) ముస్లింలు బక్రీద్ (ఈదుల్ అజ్‌హా) పండుగను జరుపుకోనున్న విషయం విదితమే. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం పలు సూచనలు చేసింది.
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈద్గాలు, మైదానాల్లో సామూహిక ప్రార్థనలు చేసుకోరాదని స్పష్టం చేసింది. మసీదుల్లో కేవలం 50 మందికి మాత్రమే ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రార్థనల సమయంలో కచ్చి తంగా భౌతిక దూరం పాటించాలని సూచించింది. కాగా, మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్స్‌లోని రాయల్ మసీదులలో కేవలం 10 మందితోనే ప్రార్థనలు జరుగుతాయని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహ్మద్ ఖాసిం ఓ ప్రకటనలో తెలిపారు.