112 కోట్లకు చేరిన ఆలయ ఆదాయం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన బక్నే బీహారీ దేవాలయ ఆదాయం వంద కోట్ల మార్కును దాటేసింది. వ్రిందావన్ లో ఉన్న ఈ కృష్ణుడి దేవాలయ ఆదాయం గత మూడేళ్లలో రెండు రెట్లు పెరిగింది. 1864లో స్థాపించిన ఈ ప్రాచీన అపురూప దేవాలయానికి 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ.112కోట్ల ఆదాయం వచ్చింది.
ప్రధానంగా విరాళాలు, దేవాలయం పేరు మీద ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీల నుంచి అధిక ఆదాయం సమకూరినట్లు సమాచారం. దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారి తెలిపిన వివరాల ప్రకారం 2015లో మొత్తం 1.26 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శింకున్నారు. కాగా, ఆలయ ఆదాయంపై ఆలయ కమిటీ ఎలాంటి అధికారికి ప్రకటనా చేయలేదు.