అస్సాంలో ఉద్రిక్తత
అపహరణకు గురైన నలుగురి మృతదేహాలు స్వాధీనం
గువాహటి: అస్సాంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బోడో తీవ్రవాదులు అపహరించిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలను బక్సా జిల్లాలోని బేకీ నది నుంచి ఆదివారం పోలీసులు వెలికితీశారు. మరోమైపు కిడ్నాప్‌నకు నిరసనగా సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) మిలిటెంట్లు శుక్రవారం బార్పేట జిల్లాకు చెందిన అతావూర్ రహమాన్(27), రూబుల్ అమీన్ (45), సద్దాం అలీ(13), బకర్ అలీ (13)లను అపహరించారు. వీరిలో బకర్ అలీ మృతదేహాన్ని శనివారమే బేకీ నది నుంచి స్వాధీనం చేసుకోగా.. మిగిలిన ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు.
మరోవైపు వీరి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు.. తమపై వేధింపులకు సంబంధించి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం శనివారం ఉదయం నుంచి సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి.. భారీగా బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్త చర్యగా సైన్యాన్ని కూడా రప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది మేలో బక్సా, కోక్రాఝర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో బోడో తీవ్రవాదుల చేతుల్లో 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.