అంతులేని చరిత్ర
సినీ ప్రపంచంలో ‘మరో చరిత్ర’ సృష్టించి... ‘అంతులేని కథ’లతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దర్శకుడు కె.బాలచందర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ చిన్నబోయింది. భాగ్యనగరంతో విశిష్ట అనుబంధం కలిగిన బాలచందర్‌ది ‘మరపురాని చరిత్ర’ అంటూ ప్రేక్షక లోకం నిరాజనాలు పలుకుతోంది. 2011 జనవరి 11న ప్రతిష్టాత్మక ఏఎన్నార్ అవార్డును అందుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఆయనతో పంచుకున్న జ్ఞాపకాలను సినీ జనం నెమరువేసుకుంటున్నారు.
అక్కినేని అవార్డు అందుకున్న బాలచందర్
సిటీబ్యూరో: ఉత్తర, దక్షిణాది భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన సినీ లెజెండ్ కె.బాలచందర్‌కు హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతకుముందు ఎన్నోసార్లు ఆయన నగరాన్ని సందర్శించినప్పటికీ 2011 జనవరి 11వ తేదీకి ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకొనేందుకు ఆయన ఆ రోజునగరానికి వచ్చారు. శిల్పకళావేదికలో కన్నుల పండువగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సందర్భంగా బాలచందర్‌ను సాదరంగా ఆహ్వానించి అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఆ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు, టి.సుబ్బరామిరెడ్డి, వీరప్పమొయిలీ, సినీ నటుడు అక్కినేని నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
తన కెరీర్లో ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్నార్ జాతీయ అవార్డును అందుకోవడం మరచిపోలేని విషయమని సంతోషం వ్యక్తం చేశారు. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన అన్నపూర్ణ స్టూడియోను సందర్శించి, ఎంతో బాగుందని ప్రశంసించారు. బాలచందర్ మరణ వార్తతో నగరంలోని సినీ ప్రియులు, ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.