విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
తొగుట, న్యూస్‌లైన్ : విద్యుదాఘాతంతో ఓ కూలి మృతి చెందిన సంఘటన మండలంలోని కాన్గల్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల పలు ఇళ్లలో మూడు రోజులుగా ఏ వస్తువు పట్టుకున్నా.. విద్యుత్ షాక్ వస్తోంది. అయితే బుధవారం కాలనీకి చెందిన వ్యవసాయకూలీ బత్తుల బాలనర్సయ్య (30) సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళాడు. దీంతో విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సిద్దిపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
మృతుడికి భార్య శ్యామల, నలుగురు పిల్లలున్నారు. అయితే కాలనీలో మూడు రోజుల కిందట ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా ఈ తంతు జరుగుతున్నా సంబంధిత అధికారులు రాకపోవడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలనీలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బాగు చేయాలని కో రుతున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.