దళారుల దందా
=నేతిదీపాల పేరుతో శఠగోపం
=రూ.200 నుంచి 300 వరకు వసూలు
=మసిబారిన వినాయక ఆలయం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో దళారుల దందా అధికమైంది. మాయమాటలతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నేతిదీపాల పేరుతో రెం డుచేతులా సంపాదిస్తున్నారు. ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే సమయంలో ఆలయం లో దళారుల సంఖ్య అధికమైంది. ఆలయంలో నేతిదీపాల కాంట్రాక్టు కాలపరిమితి ముగిసి ఏడా ది అవుతోంది.
ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు అప్పటి దేవదాయశాఖ కమిషనర్ బలరామయ్య ప్రకటించారు. దీనిపై కాంట్రాక్టర్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువైనా ఆలయాధికారులు తలొగ్గలేదు. కార్తీక మాసంలో మాత్రం సుపథ మండపంలో దీపాలు వెలిగించేందుకు అనుమతిచ్చారు. అయితే దళారులు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఆలయం బయట దేవాంగుల మండ పం సమీపంలోని వినాయకుని ఆలయం వద్ద భక్తులతో నేతిదీపాలు వెలిగింపజేస్తున్నారు.
నేతిదీపాలు వెలిగిస్తే మంచిదంటూ వీటిని బలవంతంగా అంటగడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. నేతిదీపాలు వెలిగించాలని ఆగమ శాస్త్రాల్లో లేకున్నా దళారులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నేతిదీపాలు వెలిగిస్తున్న కారణంగా వినాయకుని ఆలయం పూర్తిగా మసిబారిపోయింది. స్వామి విగ్రహమూ కనిపించడం లేదు.
చర్యలు తీసుకుంటాం
ఆలయం లోపల నేతిదీపాలు వెలిగించడాన్ని పూర్తిగా రద్దు చేశాం. ఆలయం బయట వినాయకుని విగ్రహం వద్ద నేతిదీపాలు వెలిగించకుండా చర్యలు తీసుకుంటాం.
-శ్రీరామచంద్రమూర్తి, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో