'బీజేపీ అలా చెప్పుకున్న ఆశ్చర్యపడాక్కర్లేదు'
అహ్మదాబాద్: బీజేపీకి సిద్ధాంతాలు, వివ్లవాత్మకమైన ఆలోచనలు లేవని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆగ్రహావేశాలను రెచ్చగొట్టడమే బీజేపీ విధానమని అన్నారు. మనుషుల మధ్య కలహాలు సృష్టించడమే దాని పని అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెబుతున్న బీజేపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్థాపనలో మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకపాత్ర పోషించారన్న విషయం మరవరాదన్నారు. ఇప్పడు పటేల్ విగ్రహాన్ని పెట్టేందుకు సిద్ధమవుతున్న వారు గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయానికి పటేల్ పేరు పెట్టాలనుకున్నప్పుడు వ్యతిరేకించారని మోడీని పరోక్షంగా విమర్శించారు. అముల్ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు కూడా బీజేపీ నాయకులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. పదేళ్ల తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తామే ప్రవేశపెట్టామని బీజేపీ చెప్పుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని రాహుల్ ఎద్దేవా చేశారు.