బీసీల కోసం ‘బ్యాలెట్ బడ్జెట్’: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ బీసీల ఓట్లను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన బ్యాలెట్ బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, జి.మనోహర్‌రెడ్డి, జి.ప్రేమేందర్‌రెడ్డి, కృష్ణ సాగర్‌రావు, రఘునందన్‌రావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్లో పెద్దఎత్తున నిధుల కేటాయింపు పేరు తో పేద వర్గాలను కులవృత్తులకే పరిమితం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
ఎస్టీలు, మైనారిటీలకు 12% రిజర్వేషన్లను పెంచుతామంటున్న ప్రభుత్వం 54% ఉన్న బీసీల రిజర్వేషన్లను పెంచే విషయంలో మాత్రం చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. బడుగుల ఉన్నతవిద్యకు ఊతమిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బకాయిలే రూ.3,300 కోట్లుంటే బడ్జెట్లో రూ.19వందల కోట్లే కేటాయించడాన్నిబట్టి ఈ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఏమేరకు చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందన్నారు. ఎంసెట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేస్తూ, బీసీలకు మాత్రం 10వేల ర్యాంకు నిర్దేశించి ఆంక్షలు విధించడం ఏ రకమైన అభివృద్ధో చెప్పాలన్నారు.