ఉత్తర కొరియా కవ్వింపు.. మామూలుగా లేదుగా!
సియోల్: పొరుగు దేశం దక్షిణ కొరియా.. అమెరికాతో సంయుక్త సైన్య విన్యాసాల్ని ప్రదర్శించడం ఉత్తర కొరియాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తుంటుంది. తాజాగా మరోసారి దూకుడు చర్యతో తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీసింది. బుధవారం వేకువ ఝామున శక్తివంతమైన రెండు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. ఈ విషయాన్ని అటు జపాన్.. ఇటు దక్షిణ కొరియా సైన్యాలు ధృవీకరించాయి.
అమెరికా నుంచి అణ్వాయుధాలతో కూడిన బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరిన్ దక్షిణ కొరియా తీరానికి చేరుకుంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇది చోటు చేసుకోగా.. ఉత్తర కొరియా రగిలిపోతోంది. ఈ క్రమంలోనే ఇలా క్షిపణి ప్రయోగాలు చేపట్టడం గమనార్హం. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు క్షిపణులు జపాన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల పడినట్లు తెలుస్తోంది.
A day after the inaugural session of U.S- #SouthKorea security dialogue, #NorthKorea fired two short-range #ballisticmissiles into the East Sea today. pic.twitter.com/i8tBsV6xtY
— Mirror Now (@MirrorNow) July 19, 2023
తాజా పరిణామంపై దక్షిణ కొరియా భగ్గుమంది. ఉత్తర కొరియా క్షిపణుల ప్రయోగం ఐరాస భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమేనని.. పైగా కొరియా ప్రాంతంతో పాటు అంతర్జాతీయ సమాజంలోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందంటూ దక్షిణ కొరియా సంయుక్త దళాల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు అమెరికా స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా దగ్గరుండి గత వారం శక్తివంతమైన వాంగ్సోంగ్-18 క్షిపణి ప్రయోగం పర్యవేక్షించారు. ఈ రెండు క్షిపణలూ.. తీవ్ర నష్టాన్ని కలిగించేవని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా చేసింది.