కిమ్ జోంగ్.. మరో దుస్సాహసం!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో దుస్సాహసం చేశారు. సోమవారం తెల్లవారుజామున ఏకంగా నాలుగు ఖండాంతర క్షిపణులను జపాన్ తీరానికి సమీపంలోని సముద్రంలోకి ప్రయోగించారు. ఈ విషయాన్ని జపాన్ ప్రధానమంత్రి షింజో అబె వెల్లడించారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతమైన టాంగ్‌చాంగ్ - రి వద్ద నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోకి పలు ఖండాంతర క్షిపణులను వాళ్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం కూడా తెలిపింది. ఈ విషయమై తమకు అందిన సమాచారాన్ని అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక అధ్యక్షుడు హ్వాంగ్ క్యో-ఆన్ కూడా అత్యవసరంగా జాతీయ భద్రతపై ఓ సమావేశాన్ని నిర్వహించారు.
మరోవైపు జపాన్ కూడా ఉత్తరకొరియా చర్యలను తీవ్రంగా నిరసించింది. ఈ క్షిపణి పరీక్షలు తమ సార్వభౌమత్వానికి ముప్పని అంటోంది. భద్రతామండలి తీర్మానాలకు ఇవి విరుద్ధంగా ఉన్నాయని, ఇది చాలా ప్రమాదకరమైన చర్య అని ప్రధాని షింజో అబె అన్నారు. అయితే ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లినట్లు సమాచారం లేదని జపనీస్ అధికారులు చెప్పారు. అయితే అమెరికా మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించిన మాట తమకు తెలుసని మాత్రం ఓ అధికారి అన్నారు. దక్షిణకొరియా, అమెరికా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంతో.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరకొరియా ఇటీవలే హెచ్చరించింది. ఆ తర్వాత అన్నంత పనీ చేసింది.