అందోళన వద్దు
పొగాకు పంటను ఇప్పట్లో నిషేధించం
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తాం
పొగాకు ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లో జాగృతి అవసరం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు పంటను ఇప్పట్లో నిషేధించబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు వారితో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం పొగాకు పంట నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల కారణంగా వచ్చే వ్యాధులకయ్యే ఖర్చుకు సంబంధించిన నివేదికను మంగళవారం ఇక్కడి విధానసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు పంటను నిషేధించినంత మాత్రాన పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్యను తగ్గించలేమని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా ప్రజల్లో జాగృతి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రభుత్వం తరపున కూడా మద్దతు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పొగాకు రైతులు, పొగాకు బోర్డు, వైద్య నిపుణులతో చర్చించిన అనంతరం పొగాకు పంటపై నిషేధం గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పొగాకు ఉత్పత్తులపై 10 శాతం పన్నును పెంచాల్సిందిగా ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్సకు గాను రాష్ట్రంలో ఏడాదికి రూ.983 కోట్లు ఖర్చవుతోందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తమకు నివేదిక అందించిందని సిద్ధరామయ్య తెలిపారు. ఇందులో 35 నుంచి 69 ఏళ్ల లోపు వారికి దాదాపు 73 శాతం ధనాన్ని ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పొగాకు కారణంగా ఎదురయ్యే కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, క్షయ వంటి వ్యాధుల చికిత్సకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలో వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యుటీ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.