‘మంజునాథన్’అనుకూలంగా లేకుంటే పోరాటమే
జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్
చిలకలపూడి :
కాపు సామాజిక వర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథన్ కమిషన్ నివేదిక తమకు అనుకూలంగా లేకపోతే పోరాటం తప్పదని జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి బండారు చంద్రశేఖర్ అన్నారు. ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం 31వ తేదీలోపు మంజునాథన్ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విధంగా కాపులను బీసీల్లో చేర్చాలని, సంవత్సరానికి వెయ్యి కోట్లు రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోకపోతే సెప్టెంబరు నుంచి ముద్రగడ పద్మనాభం నిర్వహించే పోరాటానికి కాపు జాతి అంత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలో కాపులు ఎంత మందికి రుణాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రూపంలో నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారో వివరాలు తెలియపరచాల్సి ఉందన్నారు. వెల్లడించని పక్షంలో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం అంతా పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు.