బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి వచ్చిన వర్తమానం తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం నిర్వహించిన జిల్లా బంద్ విజయవంతమైంది. పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు ఆర్టీసీ బస్టాండ్లకు చేరుకుని బస్‌ల రాకపోకలను నిలువరించారు. ప్రధాన ఠమొదటిపేజీ తరువాయి
కూడళ్లలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పార్టీ పిలుపునకు స్పందించి వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ నాయకులు దగ్గరుండి మూయించారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని నాయకులు ఈ సందర్భంగా ప్రతినబూనారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చిలకలూరిపేట బస్టాండ్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. బస్‌ల రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం ప్రదర్శన నిర్వహించి పట్టణంలోని దుకాణాలను దగ్గరుండి మూ యించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఉదయం పిడుగురాళ్లలో ప్రదర్శన నిర్వహించి దుకాణాలను మూయించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, కార్యనిర్వాహక సభ్యులు కోన రఘుపతి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పట్టణ కన్వీనర్ ఇక్బాల్, రూరల్ కన్వీనర్ తోట శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మునగాల మల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యకర్తలు, నాయకులు దుకాణాలను మూయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మైనార్టీ విభాగ జిల్లా కన్వీనరు సయ్యద్ మహబూబ్, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు జరిగాయి. పొన్నూరు నియోజకవర్గంలో పట్టణ కన్వీనరు పటాన్ బాబూఖాన్, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనరు డక్కుమళ్ల రవి, యువజన విభాగం పట్టణ కన్వీనరు యర్రంశెట్టి రామకృష్ణల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
మాచర్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటరు, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, మండల కన్వీనర్లు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ధర్నా నిర్వహించారు. ఆ తరువాత కొల్లూరు మండలంలో ప్రదర్శన నిర్వహించి బంద్ విజయవంతానికి కృషి చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మండల కన్వీనర్లు ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. వినుకొండ సమన్వయకర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది.
నరసరావుపేట బస్టాండ్ సెంటరులో సమన్వయకర్త గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తొలుత భారీ ప్రదర్శన నిర్వహించారు. తాడికొండ బస్టాండ్ సెంటరులో సమన్వయకర్తలు మందపాటి శేషగిరిరావు, అనూప్, కె.సురేష్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనరు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో పాదయాత్ర, ప్రదర్శనలు జరిగాయి.
గుంటూరులో...
వైఎస్సార్ సీపీ నగర కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకే ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో జరిగింది. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్‌ల రాకపోకలను నిలిపివేశారు. గంటన్నర పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పాతబస్టాండ్, జిన్నాటవర్ సెంటర్, మార్కెట్ల మీదుగా పాదయాత్ర నిర్వహించి హిందూ కళాశాల కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు ఎండీ నసీర్ అహ్మద్, షౌకత్ తదితరులు బంద్ విజయవంతానికి కృషి చేశారు.
టీడీపీ నాయకులు శంకర్ విలాస్ సెంటరుకు సమీపంలోని బ్రిడ్జిపై ధర్నా, ఆందోళన నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. హిందూ కళాశాల సెంటరులోని రాజకీయ జేఏసీ వేదిక వద్ద మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు.