బందోబస్త్ సంతృప్తి ఇచ్చింది
‘‘కేవీ ఆనంద్ సర్ మీడియాలో ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియాలో, ప్రపంచంలో జరుగుతున్న చాలా ఆసక్తికరమైన న్యూస్, ఆర్టికల్స్‌ని సేకరించేవారు. అందుకే ఆయన సినిమాలు నిజ జీవిత సంఘటనల నుంచి, సమాజం నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. మా కాంబినేషన్లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి సినిమాలొచ్చాయి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. చాలా పరిశోధన చేసి సినిమాలు తీస్తారాయన’’ అని హీరో సూర్య అన్నారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, సాయేషా సైగల్ జంటగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సూర్య విలేకరులతో మాట్లాడుతూ...
► చాలా కాలం తర్వాత ‘బందోబస్త్’ నాకొక పెద్ద ప్రాజెక్ట్.. థ్యాంక్స్ టు లైకా ప్రొడక్షన్స్. తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్‌గారి థ్యాంక్స్. 1997లో కేవీ ఆనంద్ సర్‌తో నా తొలి సినిమా ‘నెరుక్కు నేర్’ స్టార్ట్ చేశా. ఆ సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ వసంత్సర్ నాకు గురువుకంటే ఎక్కువ. నా తొలి ఫొటో ఆనంద్ సర్ తీశారు.. అదే న్యూస్పేపర్లలో వచ్చింది.
► ‘బందోబస్త్’ సినిమా చేయడం నా అదృష్టం. వ్యవసాయం, రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. దేశంలోని ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ, ఎన్ఎస్జీల బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంది. నేను కమాండర్ పాత్రలో నటించా. ఢిల్లీలో, ప్రధానమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది? అనే వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది. మన సమాజంలో ఏం జరుగుతోంది? ఏ విధంగా ప్రొటక్షన్ జరుగుతోంది? అంశాలు కూడా ఉంటాయి.
► ‘బందోబస్త్’ నాకు కొత్త అనుభూతినిచ్చింది. మన కమాండర్స్ అథారిటీస్, పవర్స్, లైఫ్ ఏంటన్నది చాలా మంది మాకు సలహాలు ఇచ్చారు. జీతం తీసుకుంటున్నందుకు రాత్రింబవళ్లు, రోజుకు 18గంటలు వాళ్లు ఏ విధంగా కష్టపడుతున్నారన్నది చూపించాం.
► కాల్పుల సమయంలో పోలీసులు, ఆర్మీ వాళ్లు రియాక్ట్ అయ్యేవిధానం వేరు. కానీ, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ వాళ్ల విధానం వేరు. వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉంటారు. బుల్లెట్స్ ఫైర్ అవుతున్నా భయపడరు. ఢిల్లీలో 2000 ఎకరాల్లో ఎన్ఎస్జీ క్యాంపస్ ఉంది. ప్రత్యేక అనుమతి తీసుకుని చాలా మంది అధికారులను కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎంతో నేర్చుకున్నాం. అక్కడ మతం, రాష్ట్రం, భాష అనే తేడా ఉండదు. ‘మనమంతా భారతీయులం.. అన్నదమ్ములం’ అనే భావన ఉంటుంది.
► మా 2:30గంటల సినిమాలో చాలా స్టోరీలు చెప్పాం. సాధారణ మనుషుల జీవితం, హై కమాండర్స్ జీవితం ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించాం. మోహన్‌లాల్ సర్‌తో తెరని పంచుకోవడం నా కల తీరనట్టు అనిపించింది. బొమన్ ఇరానీ సర్, ఆర్య, సముద్రఖని వంటి వారు కూడా మంచి పాత్రలు చేశారు. ‘బందోబస్త్’ ని కేవీ ఆనంద్సర్ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. ఎన్ఎస్జీ, ఎస్పీజీ వాళ్లపై ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఈ సినిమా చేసినందుకు నేను చాలా చాలా సంతృప్తి చెందా.
► ‘బందోబస్త్’ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సే కాదు.. ప్రొఫెషనల్, ఎమోషన్స్ ఉన్న సినిమా. ఆర్య ఈ సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రచేశారు. అతని ముందు సాయేషాతో ప్రేమ సన్నివేశాలు చేయడం ఇబ్బందిగా అనిపించింది(నవ్వుతూ). యాక్షన్ సీక్వెన్స్‌పై ఆనంద్ సర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. 150రోజులు దాదాపు ఇండియాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం.
► సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న ‘శూరారై పొట్రు’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చు. గౌతమ్ మీనన్ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాలు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. ‘సైరా’ పెద్ద ఫిల్మ్. రామ్‌చరణ్‌కి అభినందనలు. నా ఫ్రెండ్ విక్రమ్ తెరకెక్కించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ శుక్రవారం విడుదలైంది. తనకు నా శుభాకాంక్షలు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. తన ‘వాల్మీకి’ మంచి హిట్ అవ్వాలి.