బతుకులు ఛిద్రం వెయ్యి గుడిసెలు బుగ్గి
ఎనిమిది మందికి గాయాలు
- వసంత్‌కుంజ్ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం
- నిరాశ్రయులైన కాలనీ వాసులు
- మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
- బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం
వసంత్‌కుంజ్‌లోని మసూద్‌పూర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి మురికివాడ కాలి బూడిదయింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎల్జీ నజీబ్‌జంగ్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు.
సాక్షి, న్యూఢిల్లీ: క్షణాల్లో అంటుకున్న అగ్గి వందలాది మంది పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగ కున్నా నిలువ నీడ, దస్తులు, వంట సామగ్రి మాడిమసయింది. ఎనిమిది మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతం మసూద్‌పూర్ జుగ్గీజోపిడీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఉదయం 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తేరుకుని మంటలార్పేందుకు యత్నించే లోపే అవి పూర్తిగా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి.
జుగ్గీజోపిడీలకు సమీపంలోనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, చెక్కలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. మంటలు వీటికి అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బస్తీవాసులంతా పరుగుతు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 35 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
కొన్ని నిమిషాల్లోనే దాదాపు వెయ్యి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం వేళలో ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. రాత్రి వేళల్లో మంటలు అంటుకుంటే ప్రాణ నష్టం తీవ్రస్థాయిలో ఉండేదని స్థానికులు అన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించినట్టు ఢిల్లీ అగ్నిమాపక కేంద్రం డెరైక్టర్ ఏకే శర్మ తెలిపారు. ‘మాకు సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాం. మొత్తం 35 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిం చాం. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కానీ ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి’ అని పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదానికి కారణాలేంటో ఇంకా నిర్ధారణకు రాలేదని శర్మ తెలిపారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపిం చాయి. దీంతో గందరగోళం నెలకొంది. ప్రాణాలు రక్షించేందుకు గుడిసెల వాసులంతా పరుగులు తీశారు. అదే సమయంలో మంటల కారణంగా జుగ్గీల్లోని కొన్ని చిన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత పెరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యు=లు తెలిపారు.
గుడిసెలన్నీదగ్ధం కావడంతో తామంతా రోడ్డు పడ్డా మంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు అర్థిస్తున్నారు. ఘటనాస్థలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సందర్శించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం :
వసంత్‌కుంజ్ బస్తీతోపాటు శుక్రవారం నగరంలో మరోచోట అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో బెంగా లీ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి.
ఆ తర్వాత ఇవి పక్కన ఉండే మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. రెండు దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం అయినట్టు దుకాణ యజ మానులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందజేసినట్టు వారు చెప్పారు. మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి.
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోనూ..
సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి క్యాంటీన్లోనూ శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం రెండింటికి ఈ ఘటన జరగడంతో నాలుగు అగ్నిమాపకశకటాలతో మంటలను ఆర్పేశారు. ఘటన కు గల కారణాలు తెలియలేదని ఒక అధికారి వివరించారు.