బెంగళూరులో హెలీ ట్యాక్సీ టేకాఫ్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్పోర్టుకు చేరాలంటే ప్రయాణికులు కనీసం రెండు గంటల ముందు బయలుదేరాల్సి వస్తోంది. దీంతో తుంబీ ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో హెలీట్యాక్సీ సేవలకు బీఐఏఎల్ శ్రీకారం చుట్టింది.
పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీ, హెచ్ఏఎల్ చుట్టు పక్కలున్న పలు ప్రాంతాలకు రెండు హెలీ ట్యాక్సీల ద్వారా సేవలు అందజేస్తారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం ఈ సేవల్ని లాంఛనంగా ఆరంభించారు. ఒక హెలికాప్టర్లో ఐదుగురు, మరో హెలికాప్టర్లో 13 మంది ప్రయాణించవచ్చు. డిమాండ్ మేరకు హెలికాప్టర్ల సంఖ్య పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీటి చార్జీలు లగ్జరీ ట్యాక్సీల తరహాలోనే ఉంటాయన్నారు. బెంగళూరు విమానాశ్రయాన్ని జీవీకే ఇన్ఫ్రా నిర్మించినా... ఇటీవలే మొత్తం వాటాను విక్రయించి దీన్నుంచి వైదొలిగింది.