వరకట్న హత్యకేసులో భర్తకు యావజ్జీవం
విజయనగరం లీగల్: వరకట్న హత్యకేసు రుజువు కావడంతో డెంకాడ మండలం డి. తాళ్లవలస గ్రామానికి చెందిన ముద్దా యి అట్టాడ బంగారునాయుడుకు జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి బి. శ్రీనివాసరావు మంగళవారం తీర్పు చెప్పారు. వివాహ సమయంలో తీసుకున్న కట్నం సొమ్ము రూ.1.30 లక్షలు హతురాలి తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాల్సిందిగా తీర్పులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి సూర్యప్రకాశ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దాయి బంగారునాయుడు విజయనగరం మండలం చెల్లూరు గ్రామానికి చెంది న బంగారమ్మను అయిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నా డు. ఆ దంపతులకు ఒక బాబు కలిగాడు.
అప్పటి నుంచి భార్యను కుటుంబసభ్యుల సహకారంతో మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. బాబు(ముఖేష్) పుట్టుకతోనే అనారోగ్యానికి గురికావడంతో పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురమ్మని వేధించేవాడు. భర్తతో పాటు అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త మజ్జిగౌరి, మజ్జిత్రినాథ్లు కూడా వేధించేవారు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల సభ్యులు పంచాయితీ పెట్టించారు. భార్యను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చి తీసుకువెళ్లాడు.
అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో 2011 జూలై 11న బాబు ముఖేష్‌తో పాటు బంగారమ్మ గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి పెంటయ్య ఫిర్యాదు మేరకు వరకట్న హత్యగా భర్తతో పాటు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలతో కేసును రుజువు చేయడంతో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ, కుటుంబ సభ్యులను నిర్దోషులుగా విడుదల చేశారు.