‘బంగారుతల్లి’కి బంధనాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఆడపిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు.. అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2013 మే ఒకటో తేదీన ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే జిల్లాలో పథకం అమలుకు అనుసంధానంగా ఉన్న శాఖల మధ్య సమన్వయలోపంతో బంగారుతల్లి లక్ష్యం దిశగా సాగడంలేదు. దీంతో మే నుంచి పుట్టిన బంగారుతల్లుల(ఆడపిల్లల) వివరాలు పూర్తిస్థాయిలో ఇటు డీఆర్డీఏ, అటు డీఎంహెచ్‌వో అధికారుల వద్ద లేవు. జిల్లాలో ఏపీఎం, డీపీఎం పరిధిలో పథకం అమలవుతోంది.
పథకం ప్రారంభం నుంచి ఈ ఏడాది జనవరి వరకు జిల్లాలో 16 వేలకుపైగా ఆడపిల్లలు జన్మించారు. ఫిబ్రవరి 12 వరకు 10,170 మంది మాత్రమే పథకం కింద పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో ఆదిలాబాద్ పరిధిలో 6,082 మంది, ఉట్నూర్ పరిధిలో 4,088 మంది ఉన్నారు. ఇందులో 851 మంది లబ్ధిదారులు ఇంట్లోనే పాపకు జన్మనిచ్చినవారే. దరఖాస్తు చేసుకున్న 614 మంది వివరాలను అధికారులు ఆయా బ్యాంకులకు పంపించారు. వివిధ కారణాలతో వీటిలో నుంచి 167 దరఖాస్తులు తిరస్కరించారు. మిగతా వాటిలో కొన్ని పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ఆడపిల్లలు పుట్టిన వెంటనే పూరిస్థాయిలో వివరాలు సేకరించడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నా వాటి పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదు.
{పసవాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియక పుట్టిన ఆడపిల్లల వివరాలు సేకరించడం అధికారులకు కష్టంగా మారింది. ఏఎన్ఎం, ఐకేపీ సభ్యురాలు, అధికారి వీరిలో ఎవరైనా ఉంటేనే ఆ వివరాలు పథకం కింద నమోదవుతున్నాయి.
{పభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల వివరాలు రోజురోజుకు అందుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో, హోం డెలివరీ కేసుల వివరాలు వారం రోజుల్లో తెలియాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో అందడంలేదు.
పట్టణ ప్రాంతాల్లో ఆడబిడ్డకు జన్మనిస్తే నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు జనన ధ్రువీకరణ పత్రం పొందడం కష్టంగా మారింది. ఆస్పత్రుల నుంచి వివరాలు అందకపోవడం, బిడ్డ వివరాలు నమోదు కాకపోవడంతో పురపాలక సంఘం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
పథకానికి అర్హత పొందాలంటే.. స్థానిక సంస్థల నుంచి జనన ధ్రువీకరణపత్రం, ఆస్పత్రి వైద్యాధికారి ఇచ్చిన ధ్రువీకరణపత్రం ఉండాలి. ఇదంతా వారంలోగా జరగాలి. ఇందుకోసం స్థా నిక ఏఎన్ఎంలే బాధ్యత తీసుకోవాలి. వీరు ప్రసూతి, శస్త్రచికిత్సలపై దృష్టిసారిస్తున్నా పథకం వర్తింపుపై నిర్లక్ష్యంగా ఉన్నారు.
జనన ధ్రువీకరణ పత్రం కేవలం మీ-సేవ కేంద్రాల ద్వారా తీసుకోవాల్సి ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఆ పత్రం పొందడం కష్టంగా మారింది.
అన్ని పత్రాలు ఉన్నవారు నేరుగా మండల ఐకేపీ అధికారులను సంప్రదిస్తే.. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి, ఏఎన్ఎంలు ధ్రువీకరించాలని తిప్పి పంపిస్తున్నారు.
అంగన్వాడీలు ఆడపిల్లల వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. వివరాలను నెల వారీగా కార్యదర్శికి అందించి, సకాలంలో రిజిస్టర్లో నమోదు చేసేలా చూడాలి. కానీ ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. కార్యదర్శులు పనిఒత్తిడితో పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.