జకీర్ టీవీపై బంగ్లాదేశ్ లో నిషేధం
ఢాకా: బంగ్లాదేశ్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడనే కారణంతో వివాదాస్పద ముస్లిం మత బోధకుడు జకీర్ నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీస్ టీవీపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. జూలై 1న ఢాకాపై ఉగ్రదాడిలో పాల్గొన్న యువకులకు జకీర్ ప్రసంగాలే ప్రేరణ అని వార్తలొచ్చిన నేపథ్యంలో షేక్ హసీనా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్లో శాంతిభద్రతలపై సమావేశమైన ఆ దేశ కేబినెట్.. జకీర్ నడుపుతున్న ‘పీస్ టీవీ బంగ్లా’ను నిషేధించటంతోపాటు.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఇమామ్లందరూ.. అసలైన ఇస్లాంను, ఇందులోని శాంతి ప్రవచనాలను ప్రచారం చేయాలని.. యువత ఉగ్రవాదం వైపు ఆకర్శితులవకుండా ప్రభావితం చేయాలని కోరింది. బంగ్లాదేశ్లో నాయక్ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.